Begin typing your search above and press return to search.

గౌరీ లంకేష్ హత్య కేసులో కీలక మలుపు

By:  Tupaki Desk   |   14 Jun 2018 7:22 AM GMT
గౌరీ లంకేష్ హత్య కేసులో కీలక మలుపు
X
కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేష్ హత్య కేసు కీలకమలుపు తిరిగింది. గౌరీ లంకేష్ ను తానే చంపానని పరశురామ్ వాఘ్మేర్ చెప్పడం సంచలనమైంది. హిందువులు - హిందూ సంస్థలను కించపరుస్తూ ప్రసంగాలు చేస్తున్నందున గౌరీ లంకేష్ ను తుపాకీ తో కాల్చి చంపేశానని పరశురామ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వద్ద తన నేరాన్ని అంగీకరించాడు. మూడు బుల్లెట్లను ఆమె శరీరంలోకి దించినట్టు వెల్లడించాడు.

అయితే హత్య చేసిన తర్వాత మహారాష్ట్ర - మధ్యప్రదేశ్ లకు పారిపోయి తలదాచుకున్నానని.. తుపాకీని తన సహచరుల్లో ఒకరికి ఇచ్చేశానని బుధవారం విచారణలో నిందితుడు వెల్లడించాడని అధికారులు తెలిపారు. శుక్ర - శని వారాల్లో హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిట్ కు నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి అనుచేత్ మీడియాకు తెలిపారు.

గౌరీలంకేష్ కేసులో ఇప్పటికే సిట్ అదుపులో ఉన్న నవీన్ కుమార్ అలియాస్ హోట్టె నవీన్ పాత్రనూ పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తరువాత పరశురామ్ వాఘ్మేర్ - ఇతర నిందుతులకు నవీన్ ఆశ్రయం ఇచ్చాడని పోలీసులు గుర్తించారు. పరశురామ్ ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజుల కస్టడీకి తీసుకున్నారు. బుధవారం రాత్రంతా అతడిని విచారించారు. దీంతో ముందుముందు మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం కనిపిస్తోంది.