Begin typing your search above and press return to search.

పెరుగుతున్న అదానీ అంత‌స్తు.. రూ.25,000 కోట్ల కొనుగోళ్లు!

By:  Tupaki Desk   |   20 May 2021 4:30 PM GMT
పెరుగుతున్న అదానీ అంత‌స్తు.. రూ.25,000 కోట్ల కొనుగోళ్లు!
X
గుజ‌రాత్ పారిశ్రామిక వేత్త గౌత‌మ్ అదానీ వ్యాపార క‌లాపాలు విస్తృతంగా కొన‌సాగుతున్నాయి. తాజాగా అదానీ గ్రూప్ మ‌రో భారీ డీల్ సెట్ చేసుకుంది. పున‌రుత్పాద‌క ఇంధ‌న కంపెనీ అయిన ‘ఎస్‌బీ ఎన‌ర్జీ ఇండియా’కు చెందిన 100 శాతం వాటాను కొనేసింది అదానీ గ్రూప్. ఈ డీల్ విలువ 25,500 కోట్లు అని సమాచారం. దేశంలోని పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో ఇప్పటి వరకూ జరిగిన కొనుగోళ్ల‌లో ఇదే అతిపెద్ద‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.

‘ఎస్‌బీ ఎన‌ర్జీ ఇండియా’ కంపెనీని భార‌తీ గ్రూప్, జ‌పాన్ ఇన్వెస్ట్ మెంట్ దిగ్గ‌జం సాఫ్ట్ బ్యాంక్‌ జాయింట్ గా ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీలో భార‌తీ గ్రూప్ వాటా 20 శాతం కాగా.. సాఫ్ట్ బ్యాంక్ షేర్ 80 శాతంగా ఉంది. ఈ కంపెనీకి సంబంధించి నాలుగు రాష్ట్రాల ప‌రిధిలో మొత్తం 4,954 మెగావాట్ల విద్యుత్ ను ఉత్ప‌త్తి చేసే సోలార్‌, విండ్ ప‌వ‌ర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో కొన్నింట ఉత్ప‌త్తి కొన‌సాగుతోంది.

రాబోయే ప‌దేళ్ల‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద పున‌రుత్పాద‌క ఇంధ‌న సంస్థ‌గా త‌న కంపెనీని నిల‌బెట్టాల‌ని భావిస్తున్నారు అదానీ. ఈ ప్ర‌యాణంలో ఇది మ‌రో అడుగుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. తాజా కొనుగోళ్ల‌తో అదానీ గ్రీన్ ఎన‌ర్జీ ఇంధ‌న ప్రాజెక్టుల మొత్తం సామ‌ర్థ్యం 24.3 గిగా వాట్ల‌కు చేరుకోనుంది.

క‌రోనా కాలంలోనూ అదానీ గ్రూప్ భారీ లాభాల‌ను ఆర్జిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అన్ని రంగాలు కుదేల‌వుతున్నా.. అదానీ సంస్థ‌లు మాత్రం లాభాల‌ను క‌ళ్ల జూస్తున్నాయి. తాజా డీల్ తో ఆయ‌న కంపెనీ షేరు విలువ 3.74 శాతం పెరిగింది. బుధ‌వారం నాటి ట్రేడింగ్ ప్ర‌కారం అదానీ గ్రీన్ ఎన‌ర్జీ లిమిటెడ్ షేరు విలువ 1,244.30కి చేరింది.