Begin typing your search above and press return to search.

ఏపీ రాజ్యసభ కోటాలో గౌతమ్ అదానీ సతీమణి.. జగనా మజాకానా!

By:  Tupaki Desk   |   29 April 2022 5:40 AM GMT
ఏపీ రాజ్యసభ కోటాలో గౌతమ్ అదానీ సతీమణి.. జగనా మజాకానా!
X
ఏమైనా సిత్రమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వెనకా ముందు ఆలోచించకుండా ఓకే చెప్పేసే సత్తా ఉన్న అధినేతగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చెప్పాలి. పార్టీ కోసం పరితపించే వారికి.. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కఠినంగా కష్టపడిన వారికి కాకుండా.. డబ్బు.. హోదా.. లాబీయింగ్ చేసే వారికి అత్యుత్తమ పదవులు దక్కటానికి మించిన విషాదం ఏముంటుంది? ఏపీ తరఫు నామినేట్ అయ్యే రాజ్యసభ సీట్లను డబ్బున్న మారాజులు ఎవరైనా పొందొచ్చన్న భావన కలిగేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి నిర్ణయం తీసుకోనున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

గతంలో రిలయన్స్ సామ్రాజ్యంలో ప్రముఖుడిగా పేరున్న పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చిన సీఎం జగన్ తాజాగా మాత్రం ప్రఖ్యాత పారిశ్రామికవేత్త.. జగన్ కు సన్నిహితుడిగా పేరున్న గౌతమ్ అదానీ సతీమణి ప్రీతి అదానీకి రాజ్యసభ సీటు ఖాయమన్న మాట వినిపిస్తోంది. గతంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఆబ్లిగేషన్ తో ఆయనకు సన్నిహితుడు.. తన టైం మొత్తాన్ని రిలయన్స్ ఎదుగుదలకు మాత్రమే ఉపయోగించే పరిమిళ్ నత్వానీకి రాజ్యసభ సీటు కేటాయించటంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు.

ఏపీకి ఏ మాత్రం లింకు లేని ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేస్తే.. రాష్ట్రానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదన్న చర్చ జరగటం.. అందుకు తగ్గట్లే పరిమిళ్ తీరు ఉండటం గమనార్హం. మరికొద్ది రోజుల్లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో.. అందులో ఒక స్థానాన్ని గౌతమ్ అదానీ సతీమణికి ఇవ్వటం ద్వారా బీజేపీ అధినాయకత్వం మనసు దోచుకోనున్నట్లు చెబుతున్నారు.

గతంలో పరిమిళ్ నత్వానీకి రాజ్యసభ సీటు కేటాయించిన అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినప్పటికీ సీఎం జగన్ స్పందించింది లేదు. తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకే సీఎం తాజా ఢిల్లీ టూర్ అంటున్నారు.

ఈ మధ్యన అనూహ్యంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్.. ప్రధాని మోడీని కలవటం.. ఆయనతో రాష్ట్ర సమస్యల గురించి చర్చించినట్లుగా చెప్పటం తెలిసిందే. అయితే.. సీఎం జగన్ ఇచ్చిన వినతిపత్రంలో ఏ ఒక్క అంశంపైనా కేంద్రం సానుకూలంగా స్పందించింది లేదు.

ఇంతలో మరోసారి జగన్ ఢిల్లీ పర్యటన కు వెళ్లటం.. అదే సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన ఒక సీటును పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సతీమణికి కేటాయించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారన్న మాట బయటకు రావటం గమనార్హం. ఏమైనా రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేకుండా.. బడా పారిశ్రామికవేత్తలకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే విషయంలో జగన్ పెద్ద మనసును మెచ్చుకోకుండా ఉండలేం. కాదంటారా?