Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఓపెనర్ వ‌ర్సెస్ బీజేపీ ఓపెన‌ర్..పొలిటిక‌ల్ వార్ షురూ

By:  Tupaki Desk   |   1 Aug 2019 7:40 AM GMT
కాంగ్రెస్ ఓపెనర్ వ‌ర్సెస్ బీజేపీ ఓపెన‌ర్..పొలిటిక‌ల్ వార్ షురూ
X
ఇద్దరు భారత క్రికెట్ జట్టు ఓపెనర్ల‌ మధ్య అదిరిపోయే పొలిటికల్ యుద్ధం జరగనుంది. ఈ ఇద్దరి క్రికెటర్లు మైదానంలో ముక్కుసూటిగా వ్యవహరించిన వారే. మైదానంలో ఏదైనా తప్పు జరిగితే సొంత‌ జట్టు ఆటగాడు అయినా... ప్రత్యర్థి జట్టు ఆటగాడు అయినా నా కంటి చూపుతోనే సమాధానం ఇచ్చేవారే... ఆటలో దూకుడు తనానికి మారుపేరైన ఆ ఇద్దరు భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్స్ గానే సేవలు అందించారు. ఇప్పుడు వారిద్దరూ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పొలిటికల్ సంగ్రామానికి రెడీ అవుతున్నారు. ఆ ఇద్ద‌రు మాజీ ఆట‌గాళ్లు ఎవ‌రో కాదు నవజ్యోత్ సింగ్ సిద్ధూ - గౌతమ్ గంభీర్. ఇప్పుడు ఢిల్లీలో వీరు పొలిటికల్ పిచ్‌ పై ఢీ కొట్టబోతున్నారు.

వీరిలో సిద్ధూ ముందుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. బీజేపీతో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతోంది. బీజేపీ నుంచి అమృత్ సర్ ఎంపీగా గెలిచిన సిద్ధూ అరుణ్ జెట్లీ కోసం తన సీటును త్యాగం చేశారు. ఆ త‌ర్వాత సిద్ధూను బిజెపి రాజ్యసభకు పంపింది. బిజెపితో గ్యాప్ రావడంతో ఆయన రాజ్యసభతో పాటు బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ లోకి జంప్ చేశారు. మైదానంలో సిక్స‌ర్ల కింగ్‌ గా... దూకుడైన ఆటతో భారత క్రీడాభిమానుల మనసు గెలుచుకున్న సిద్ధూ రాజకీయాల్లోనూ అంతే దూకుడుగా ఉంటారన్న పేరుంది.

కాంగ్రెస్‌ లో చేరిన సిద్ధూ రాహుల్ మద్దతుతో పంజాబ్ నుంచి గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. అయితే సిఎం అమరేంధ్రతో వివాదం ముదరడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నిక‌ల‌కు ముందే సిద్ధూను కాంగ్రెస్ జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోరినా అందుకు అంగీక‌రించ‌లేదు. ఆయ‌న పంజాబ్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇప్పుడు పంజాబ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు సుముఖంగా ఉండ‌డంతో రాహుల్ సిద్దూను ఢిల్లీ పీసీసీ చీఫ్‌ గా చేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. షీలా దీక్షిత్ మృతితో ఢిల్లీలో కాంగ్రెస్‌ కు బ‌ల‌మైన నేత‌ల కొర‌త ఉండ‌డంతో ఆ స్థానాన్ని సిద్ధూతో భ‌ర్తీ చేయాల‌ని చూస్తోంది.

ఇక మ‌రో మాజీ ఓపెన‌ర్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే ఢిల్లీ పాలిటిక్స్‌ లో బిజిగా ఉన్నారు. ద‌శాబ్దాల త‌ర్వాత భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్ గెలుచుకోవ‌డంలో ఫైన‌ల్లో గంభీర్ ఇన్సింగ్సే కీల‌కమైంది. ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ఆయన ఎంపీగా గెలిచారు. ఢిల్లీ రాజ‌కీయాల‌ను శాసించాల‌ని కొద్ది రోజులుగా గంభీర్ ఉవ్విళ్లూరుతున్నాడు. త్వ‌ర‌లో జ‌రిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ అక్క‌డ గంభీర్‌ కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు రెడీ అవుతోంది. ఇది గ‌మ‌నించే కాంగ్రెస్‌ గంభీర్‌ కు పోటీగా సిద్దూను ఢిల్లీకి తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. మ‌రి ఈ ఇద్ద‌రు మాజీ ఓపెన‌ర్ల పొలిటిక‌ల్ సంగ్రామంలో ఎవ‌రిది పైచేయి అవుతుందో ? చూడాలి.