Begin typing your search above and press return to search.

రాజకీయాలపై గంభీర్ తేల్చేశాడు..

By:  Tupaki Desk   |   10 Dec 2018 5:39 AM GMT
రాజకీయాలపై గంభీర్ తేల్చేశాడు..
X
రెండు ప్రపంచ కప్ విజయాల్లో పాలుపంచుకోవడమే కాక.. భారత క్రికెట్ జట్టు టెస్టుల్లో నంబర్ వన్ కావడంలోనూ కీలక పాత్ర పోషించిన ఆటగాడు గౌతమ్ గంభీర్. ఒక ఐదేళ్లు భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న గౌతమ్.. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. తిరిగి టీమ్ ఇండియాలోకి వచ్చినా సత్తా చాటలేకపోయాడు. ఇక కెరీర్‌పై ఆశలు వదులుకున్న 36 ఏళ్ల గంభీర్.. నిన్నటితో ఆటకు గుడ్ బై చెప్పేశాడు. ఆంధ్రాతో డ్రాగా ముగిసిన రంజీ మ్యాచ్‌తో కెరీర్‌కు ముగింపు పలికాడు. ఐతే గంభీర్ సామాజిక విషయాలపై స్పందించే తీరు.. అతడి ట్వీట్లు చూస్తే.. అతను రాజకీయాల్లోకి రావచ్చొన్న అభిప్రాయాలు జనాలకు కలిగాయి. సరిహద్దులో దేశం కోసం పోరాడే సైనికుల కుటుంబాల కోసం అతను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. ఇవన్నీ చూసి క్రికెట్ తర్వాత గంభీర్ ప్రయాణం రాజకీయాల వైపే అని అంతా అనుకుంటున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గంభీర్ కు టికెట్ ఇచ్చి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయిస్తుందన్న ప్రచారం కూడా ఈ మధ్య ఊపందుకుంది. కానీ గంభీర్ మాత్రం తనకలాంటి ఉద్దేశాలేమీ లేవని చెప్పేశాడు. తాను రాజకీయాల్లోకి రావట్లేదన్నాడు. ట్విట్టర్లో మాట్లాడినంత మాత్రాన దాన్ని బట్టి తాను రాజకీయాల్లోకి వచ్చేస్తానని అనుకోకూడదన్నాడు. ట్వీట్లు చేయడం వేరు.. రాజకీయాల్లోకి దిగడం వేరని అతనన్నాడు. తన మనస్తత్వానికి అసలు రాజకీయాలు పడవని తేల్చేశాడు. తాను క్రికెట్ కే అంకితం అవుతానని.. కోచ్ గా మారే ఉద్దేశంలో ఉన్నానని గంభీర్ స్పష్టత ఇచ్చాడు. ఢిల్లీలో యువ క్రికెటర్లకు సాయపడాలన్న ఆలోచనతో ఉన్నట్లు కూడా అతను చెప్పాడు. కెరీర్ కు గుడ్ బై చెప్పడానికంటే ముందు గంభీర్.. వ్యాఖ్యాతగా ట్రై చేశాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో కామెంట్రీ చేశాడు. కానీ దానికి బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో ఇక కోచింగ్ మీద దృష్టిపెట్టబోతున్నాడన్నమాట.