Begin typing your search above and press return to search.

నోరు పారేసుకున్న ఆఫ్రిదీకి.. భలేగా పంచ్ ఇచ్చాడు!

By:  Tupaki Desk   |   6 Aug 2019 9:24 AM GMT
నోరు పారేసుకున్న ఆఫ్రిదీకి.. భలేగా పంచ్ ఇచ్చాడు!
X
కదిలించుకొని తిట్టించుకోవటం కొందరికి భలే సరదాగా ఉంటుంది. పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీకి ఈ అలవాటు ఎక్కువ. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటే ఇతగాడికి.. ఏదైనా జరిగిన వెంటనే ఆత్రం ఆపుకోలేనట్లుగా ట్వీట్ పెట్టేసి.. పంచ్ లు వేయించుకుంటూ ఉంటాడు. తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి ఎదురైంది.

సోమవారం జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై చోటు చేసుకున్న పరిణామాలు..రాజ్యసభలో ఆమోదం పొందిన వైనంపై ఆఫ్రిది ట్వీట్ తో స్పందించాడు. కశ్మీర్ విషయంలో మోడీ సర్కారు అనుసరించిన తీరును తప్పు పడుతూ.. ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం.. మనందరిలానే కశ్మీరీ ప్రజలకు ప్రాథమిక హక్కులు ఇవ్వాల్సిందే. అసలు ఐక్యరాజ్య సమితి ఎందుకు ఉంది? ఇప్పుడెందుకు నిద్ర పోతోంది? మానవత్వానికి వ్యతిరేకంగా కశ్మీర్ లో నేరాలు.. ఘోరాలు జరుగుతున్న విషయాల్ని గుర్తించాలని.. అగ్రరాజ్య అధినేత (ట్రంప్) ఈ ఇష్యూలో జోక్యం చేసుకోవాలంటూ నోరు పారేసుకున్నాడు.

ఇతగాడి ట్వీట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయులు పలువురు తిట్టిపోస్తున్నారు. ఆఫ్రిదీ ట్వీట్ పై టీమిండియా మాజీ క్రికెటర్ కమ్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ రియాక్ట్ అయ్యారు. నోరు తెరిచేందుకు వీలు లేని రీతిలో ఆయన పంచ్ ఇస్తూ..అఫ్రిదీ.. ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు.. తాను చెప్పిన విషయాలకు అతన్ని అభినందించాలి. అయితే.. అతడో చిన్న విషయాన్ని మర్చిపోయాడు. అతను చెప్పినవన్నీ జరుగుతోంది పాక్ అక్రమిత కశ్మీర్ లోనే. అఫ్రిదీ ఆందోళన చెందకు.. త్వరలోనే పీవోకే పరిస్థితుల్ని కూడా సరిచేస్తామంటూ దిమ్మ తిరిగేలా కౌంటర్ పంచ్ ఇచ్చారు. గౌతమ్ గంభీర్ ట్వీట్ పై పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.