Begin typing your search above and press return to search.

ఆ పని చేసిన కోడెల కొడుక్కి రూ.కోటి ఫైన్

By:  Tupaki Desk   |   16 Oct 2019 7:15 AM GMT
ఆ పని చేసిన కోడెల కొడుక్కి రూ.కోటి ఫైన్
X
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రాజకీయ ప్రయాణం చాలా పెద్దది. ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు కూడా ఎక్కువే. మెరుపులు ఎన్ని ఉన్నాయో మరకలు కూడా అన్నే కనిపిస్తాయి. అయితే.. కోడెలకు ఆయన కొడుకు కారణంగా ఎదురైన అవమానాలు అన్నిఇన్నికావని ఆయన సన్నిహితుల నోట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కే ట్యాక్స్ పేరుతో నరసరావుపేటతో పాటు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో కొడుకు శివరాం చేసిన పనికి కోడెల శివప్రసాద్ ఇమేజ్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయినట్లుగా చెప్పాలి.

కే ట్యాక్స్ పేరుతో సామాన్యులకు చుక్కలు చూపించిన శివరామ్ ఇప్పటికే స్పీకర్ చాంబర్ లో ఉండాల్సిన ఫర్నీచర్ ను తన సొంతానికి వాడేసుకోవటం.. తానునిర్వహిస్తున్న గౌతమ్ హోండాషోరూంలో వినియోగించిన వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా కోడెల శివరాం కక్కుర్తికి సంబంధించిన మరో షాకింగ్ అంశాన్ని గుర్తించారు. రూల్స్ ను అతిక్రమించి హోల్ సేల్ గా వాహనాల్ని కొనుగోలు చేసి.. ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా వాటిని అమ్మినట్లుగా గుర్తించారు. దాదాపు 40వేల టూవీలర్ వాహనాలకు పన్నులు ఎగవేసినట్లుగా గుర్తించారు.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఆర్టీఏ అధికారులు నిబంధనలకు అనుగుణంగా రూ.కోటి జరిమానాను విధించారు. దీంతో తన తప్పును ఒప్పుకున్న శివరాం తనకు రెండు రోజులు సమయం ఇవ్వాలని.. ఆ మొత్తాన్ని చెల్లిస్తానని కోర్టుకు తెలియజేశారు.

హీరో హోండా షోరూంను నిర్వహించిన శివరాం టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్) లేకుండా బైకులు డెలివరీ చేసేవారు. కోడెల కొడుకు కావటంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైనాన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయారు. ఇలా అతను ఏకంగా 1025 బైకుల్ని అమ్మారు. ఈ ఉదంతంలో శివరాం మీద ఐపీసీ 406, 409, 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోడెల శివరాం కక్కుర్తి పనులకు ముక్కున వేలేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మరెన్ని లీలలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.