Begin typing your search above and press return to search.

షాకింగ్.. అత‌డి సంపాద‌న రోజుకు రూ.1,612 కోట్లు!

By:  Tupaki Desk   |   22 Sep 2022 5:30 AM GMT
షాకింగ్.. అత‌డి సంపాద‌న రోజుకు రూ.1,612 కోట్లు!
X
2022కి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా ధ‌న‌వంతుల జాబితాలో అదానీ గ్రూప్ అధినేత గౌత‌మ్ అదానీ తొలిసారి అగ్ర‌స్థానంలో నిలిచారు. గౌతమ్‌ అదానీ రూ.10,94,400 కోట్ల సంపదతో తొలిసారిగా ప్ర‌థ‌మ‌స్థానాన్ని ద‌క్కించుకున్నారు. రిల‌య‌న్స్ అధినేత ముకేష్ అంబానీని ప‌క్కకు నెట్టి గౌత‌మ్ అదానీ ఈ జాబితాలో మొద‌టి స్థానంలో చోటు సాధించారు. అదానీ సంపాద‌న గ‌తేడాది రోజుకు రూ.1,612 కోట్ల రూపాయ‌ల‌ని హురున్ ఇండియా తెలిపింది.

గత‌ ఏడాది కాలంలో గౌత‌మ్ అదానీ సంపద రోజుకు సరాసరిగా రూ.1,612 కోట్ల చొప్పున ఎగబాకింద‌ని హురున్ ఇండియా వెల్ల‌డించింది. ఇది ఏడాది కాలంలో రెట్టింపునకు పైగా పెరిగిందని తెలిపింది. ఏడాది కాలంలో 116 శాతం (రూ.5,88,500 కోట్లు) అదానీ సంప‌ద వృద్ధి చెందిందని పేర్కొంది. గత‌ ఐదేళ్లలో చూస్తే అదానీ సంపద 1,440 శాతం పుంజుకుంది.

ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ రూ.7,94,700 కోట్ల ఆస్తితో తొలిసారి రెండో స్థానానికి ప‌డిపోయారు. గత ఏడాది ఆయన ఆస్తి 11 శాతం పెరిగింది. అయిన‌ప్ప‌టికీ పదేళ్లలో తొలిసారిగా త‌న అగ్రస్థానాన్ని అదానీకి కోల్పోవాల్సి వచ్చింది. గత ఏడాది వార్షిక నివేదిక ప్రకారం.. అదానీ కంటే అంబానీ రూ.2 లక్షల కోట్ల అధిక ఆస్తిని కలిగి ఉండగా.. ఈసారి జాబితాలో అంబానీ కంటే అదానీ రూ.3 లక్షల కోట్ల అధిక సంపద కలిగి ఉండ‌టం విశేషం.

వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ లో ఈసారి 1,103 మందికి చోటు దక్కింది. గత ఏడాదితో పోలిస్తే కుబేరులు 96 మంది పెరిగారు. గత‌ ఐదేళ్లలో 62 శాతం వృద్ధి నమోదైందని నివేదిక తెలిపింది. 2022 ఆగస్టు 30 నాటికి కనీసం రూ.1,000 కోట్లు, అంతకుపైగా ఆస్తి కలిగిన వారికి ఈ జాబితాలో చోటు ఇచ్చారు.

క్విక్‌ కామర్స్‌ స్టార్టప్‌ జెప్టో సహ వ్యవస్థాపకురాలు కైవల్య వోహ్రా (19 ఏళ్లు) ఈసారి రిచ్‌ లిస్ట్‌లోని అత్యంత పిన్న వయస్కురాలు. ఆమెకు తొలిసారిగా ఈ జాబితాలో చోటు ద‌క్కింది. ఈ జాబితాలో 100 మంది స్టార్టప్‌ వ్యవస్థాపకులకు స్థానం దక్క‌డం గ‌మ‌నార్హం. ఈ 100 మంది మొత్తం ఆస్తి రూ.5.06 లక్షల కోట్లు కాగా, వారి సగటు వయసు 40 ఏళ్లే కావ‌డం ఇంకో విశేషం.

జాబితాలో రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తి కలిగిన‌వారు 12 మంది ఉన్నారు. కాగా గతేడాది 13 మంది ఈ విభాగంలో ఉన్నారు. కనీసం బిలియన్‌ డాలర్ల (100 కోట్ల డాలర్లు=రూ.8,000 కోట్లు) సంపద కలిగినవారు 221 మంది ఈ ఏడాదికి అత్య‌ధిక ధ‌న‌వంతుల జాబితాలో నిలిచారు. ఇంకో ముఖ్య విష‌యం ఏమిటంటే.. జాబితాలో నిలిచిన‌వారిలో 67 శాతం (735) మంది స్వయంశక్తితో ఎదిగిన వారే. గతేడాది వీరి సంఖ్య 659గా ఉంది.

గతేడాదితో పోలిస్తే ఈసారి 602 మంది సంపద వృద్ధి చెందగా.. అందులో 149 మంది కొత్తవారే కావ‌డం గ‌మ‌నార్హం. 415 మంది ఆస్తి తరిగిపోవ‌డంతో గ‌తేడాది జాబితాలో నిలిచిన‌ 50 మంది స్థానం కోల్పోయారు. మ‌రో నలుగురు మరణించారు. ఇక న‌గ‌రాల‌వారీగా అత్యధికంగా ముంబై నుంచి 283 మందికి చోటు దక్కగా.. ఢిల్లీ నుంచి 185, బెంగళూరు నుంచి 89, హైదరాబాద్‌ నుంచి 64, చెన్నై నుంచి 51 మంది అత్య‌ధిక ధ‌న‌వంతుల జాబితాలో చోటు ద‌క్కింది.

ఇక ధ‌న‌వంతుల్లో అత్య‌ధికంగా ఫార్మా రంగం నుంచి 126 మందికి జాబితాలో చోటు ద‌క్కింది. కెమికల్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ రంగంలో 102 మంది, సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ నుంచి 84 మంది ఈ జాబితాలో నిలిచారు.

ఈసారి జాబితాలోని సంపన్నుల మొత్తం ఆస్తి విలువ తొలిసారిగా రూ.100 లక్షల కోట్లకు చేరుకుందని హురున్‌ వెల్లడించింది. సింగపూర్‌, యూఏఈ, సౌదీ అరేబియాల మొత్తం జీడీపీ కంటే కూడా ఇది అధికం కావ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.