Begin typing your search above and press return to search.

మీరే తేల్చుకోండి..బంతిని ఆప్ కోర్టులో పడేసిన గంభీర్

By:  Tupaki Desk   |   10 May 2019 6:58 AM GMT
మీరే తేల్చుకోండి..బంతిని ఆప్ కోర్టులో పడేసిన గంభీర్
X
ఢిల్లీలో రాజకీయం ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ-బీజేపీ అభ్యర్థి - మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మధ్యే తిరుగుతోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు హద్దులు మీరుతున్నాయి. తనకు వ్యతిరేకంగా అశ్లీల - అభ్యంరకర వ్యాఖ్యలతో కూడిన కరపత్రాలను గంభీర్ పంచుతున్నాడంటూ గురువారం ఆప్ నేత అతిషి చేసిన ఆరోపణలపై గంభీర్ కూడా అంతే తీవ్రంగా స్పందించాడు. చేయని పనులను చేశానని ప్రచారం చేస్తారా? అంటూ విరుచుకుపడ్డాడు. అంతేకాదు, మర్యాదగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు.

విపరీత ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారని మండిపడ్డాడు. చేసిన అసత్య ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పారో సరేసరి - లేదంటే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ - ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలకు నోటీసులు పంపాడు. మహిళలను అత్యంత గౌరవంగా చూసే కుటుంబం నుంచి తాను వచ్చానని - మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించే నీచ సంస్కృతి తనది కాదని గంభీర్ చెప్పుకొచ్చాడు. తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పాడు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంత నీచానికి దిగజారుతానని అనుకోలేదన్నాడు. అంతేకాదు, ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని కనుక వారు భావిస్తే నిరభ్యంతరంగా తనపై చర్యలు తీసుకోవచ్చంటూ సవాలు విసిరాడు. తాను అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని తెగేసి చెప్పాడు.

గంభీర్ పరువు నష్టం నోటీసులు పంపినప్పటికీ ఆప్ నేతలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాము కూడా గంభీర్‌ పై పరువునష్టం దావా వేస్తామంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. కాగా, గురువారం విలేకరుల సమావేశం నిర్వహించిన అతిషి గంభీర్ పంపిణీ చేసినట్టుగా చెబుతున్న కరపత్రాలను చదివి వినిపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇందులో తనపైన - తన కుటుంబంపైన అసభ్యకరంగా వ్యాఖ్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కరపత్రాలను దిన పత్రికల్లో ఉంచి పంపిణీ చేస్తున్నారని - గంభీర్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. మరోవైపు తనపై చేసిన ఆరోపణల్ని రుజువుచేస్తే ఇప్పటికిప్పుడు తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటానని - నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగాలంటూ కేజ్రీవాల్‌ - అతిషిలకు గంభీర్‌ సవాల్ విసిరాడు.