Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కేబినెట్‌లోకి మేక‌పాటి స‌తీమ‌ణి!

By:  Tupaki Desk   |   3 March 2022 2:30 AM GMT
జ‌గ‌న్ కేబినెట్‌లోకి మేక‌పాటి స‌తీమ‌ణి!
X
ఇటీవ‌ల హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి కుటుంబానికి, వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు మ‌ధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మేక‌పాటి.. జ‌గ‌న్‌కు స‌హాధ్యాయిగా పేర్కొంటారు. అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా కూడా ఈ కుటుంబంతో జ‌గ‌న్‌కు స‌త్సంబంధాలు నెల‌కొన్నాయి.

ఈ నేప‌థ్యంలో మేక‌పాటి మ‌ర‌ణం.. జ‌గ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా ఎంతో బాధించిం ద‌నే చెప్పాలి.ముఖ్యంగా కీల‌క‌మైన మంత్రిని ఆయ‌న కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న స్తానం భ‌ర్తీ చేయ‌డంతోపాటు.. ఆయ న కుటుంబానికి భ‌రోసా క‌ల్పించేందుకు జ‌గ‌న్‌.. కీల‌క నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

దీనిలో భాగంగా మేక‌పాటి స‌తీమ‌ణి శ్రీకీర్తికి త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తార‌ని అంటున్నారు. వాస్తవానికి మేక‌పాటి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఆరు మాసాల్లోగా ఉప ఎన్నిక జ‌రుగుతుంది. ఈ టికెట్‌ను ఈ కుటుంబానికే కేటాయిస్తారు. ఈ క్ర‌మంలో ఆయ‌న స‌తీమ‌ణికి ఇవ్వ‌డం ద్వారా కుటుంబాన్ని ఆద‌రించినట్టు అవుతుంది.

ఈ నేప‌థ్యంలో ఎలాగూ శ్రీకీర్తికే టికెట్ ఇస్తారు క‌నుక‌.. ఆరు మాసాల వ‌ర‌కు కూడా వెయిట్ చేయ‌కుండా.. ముందుగానే ఆమెకు మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఆరు మాసాల్లోపు ఆమె ఉప ఎన్నిక‌లో విజ‌యం ద‌క్కించుకుంటే స‌రిపోతుంది.

ఈ దిశ‌గానే జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. జ‌గ‌న్ ఆలోచ‌న ఇలా ఉంటే.. భ‌ర్త‌ను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న శ్రీకీర్తి ఎలాంటి ఆలోచ‌న చేస్తున్నార‌నేది ఆస‌క్తిగా మారింది. ఈ నేప‌థ్యంలో శ్రీకీర్తిని ఒప్పించే బాధ్య‌త‌ను సీనియ‌ర్ నాయ‌కు డు, స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌కు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, శ్రీకీర్తిని పార్టీలోకి తీసుకోవ‌డంతోపాటు.. ఆమెకు మంత్రి ప‌దవి ఇచ్చే విష‌యాన్ని మేక‌పాటి కుటుంబ పెద్ద‌, సీనియ‌ర్ నాయ‌కుడు మాజీ ఎంపీ రాజ‌మోహ‌న్‌రెడ్డికి సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే, గౌతం రెడ్డి పెద‌క‌ర్మ జ‌రిగే గురువారం లేదా శుక్ర‌వారం నాడు.. ఈ కార్య‌క్ర‌మానికి స‌ల‌హాదారు స‌జ్జ‌ల హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌ను ఆయ‌న మేక‌పాటి కుటుంబానికి చెప్పే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇదే సమ‌యంలో శ్రీకీర్తికి కూడా వివ‌రించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఈ ఆఫ‌ర్‌కు శ్రీకీర్తి అంగీక‌రిస్తే.. త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే ఆమెను కేబినెట్‌లోకి తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ అప్పుడు కుద‌ర‌క‌పోతే.. కొంత‌కాలం త‌ర్వాత‌.. తీసుకునే ఛాన్స్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

మ‌రో ఆరు మాసాల్లో ఆత్మ‌కూరుకు జ‌రిగే ఉప ఎన్నిక‌లో మేక‌పాటి శ్రీకీర్తి పోటీకి చేస్తే.. సంప్ర‌దాయంగా వ‌స్తున్న ఆన‌వాయ‌తీ ప్ర‌కారం.. ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీలు పోటీకి దూరంగా ఉంటాయి. దీంతో ఆమెన‌ను ఇప్ప‌టికిప్పుడు కేబినెట్‌లోకి తీసుకున్నా.. ఇబ్బంది లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదిలావుంటే.

ఈ నెల 3 న జ‌ర‌గాల్సిన కేబినెట్ మీటింగ్‌ను మేక‌పాటి ఉత్త‌ర క్రియ‌ల నేప‌థ్యంలో వాయిదా వేశారు. మ‌రోవైపు.. ఉద‌య‌గిరిలోని మెరిట్స్ కాలేజీని మేక‌పాటి గౌతంరెడ్డి అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీగా మార్చేందుకు ఈ కుటుంబం అభ్య‌ర్థించిన నేప‌థ్యంలో దీనికి ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊప‌నుంది.