Begin typing your search above and press return to search.

అమెరికా లో ఖాళీగా కోటి జాబ్స్ త్వరపడండి

By:  Tupaki Desk   |   29 July 2022 4:06 AM GMT
అమెరికా లో ఖాళీగా కోటి జాబ్స్ త్వరపడండి
X
కొన్ని దశాబ్దాల క్రితం కమ్యునిస్టులకు సంబంధించిన ఒక జోక్ ను తరచూ వాడేవారు. సిద్ధాంతాలు చెప్పే కమ్యునిస్టులకు దేశం కంటే కూడా పార్టీ మీదనే మమత ఎక్కువన్న విషయాన్ని వ్యంగ్యంగా చెప్పే క్రమంలో.. 'చైనాలో కమ్యునిస్టుకు జలుబు చేస్తే.. ఇండియాలోని కామ్రేడ్ కు ముక్కు కారుతుంది' అనే నానుడి పలువురి మాటల్లో వినిపించేది.

ఇందులోని నిజానిజాల్ని పక్కన పెడితే.. ఇప్పుడు మాత్రం ప్రపంచం మొత్తం అగ్రరాజ్యం అమెరికా చుట్టూనే తిరుగుతోంది. ఆ దేశంలో చోటు చేసుకునే పరిణామాలు ప్రపంచాన్ని ఇట్టే ప్రభావితం చేస్తున్నాయి. వారి కరెన్సీ డాలర్ కు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా.. ప్రపంచంలోని పలు ఆర్థిక వ్యవస్థల మీద ప్రభావం చూపే పరిస్థితి.

ఇలాంటివేళలో అమెరికా ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా ఆర్థిక మాంద్యం కోరలు జాస్తుందన్న వార్తల జోరు పెరుగుతోంది. అమెరికాలో మాంద్యం మొదలైతే.. దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద ఉంటుందన్న విషయం తెలిసిందే. అమెరికాలో మాంద్యం ఉందన్న మాట ఎలా చెబుతారు? అంటే.. దానికో లెక్కను చెబుతున్నారు.

సాంకేతికంగా చూస్తే.. జీడీపీ వ్రద్ధి రేటు వరుసగా రెండు త్రైమాసికాలు మైనస్ స్థాయిలో నమోదైతే.. దాన్ని ఆర్థిక మాంద్యంగా అభివర్ణిస్తారు. ఇదే అంశాన్ని గణాంకాల రూపంలో చూస్తే.. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ అమెరికా జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 0.9 శాతానికి పడిపోయింది. మార్చి త్రైమాసికంలోనే అమెరికా జీడీపీ మైనస్ 1.6 శాతంగా నమోదైంది. జీడీపీ వృద్ధి రేటు వరుసగా రెండు త్రైమాసికాలు మైనస్‌ స్థాయిలో నమోదు అయితే దాన్ని కచ్ఛితంగా మాంద్యంగానే భావిస్తారు.

దీనికి తోడు చమురు ధరల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం నలభై ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవటం.. దీన్ని కట్టడి చేసేందుకు అమెరికా కేంద్ర బ్యాంకు వరుసగా వడ్డీ రేట్లు పెంచటం కూడా ఈ వాదనకు బలం చేకూరేలా చేస్తోంది. అయితే.. మాంద్యం అమెరికాను కమ్మేస్తుందన్న వాదనల్ని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు మాత్రం ఖండిస్తోంది. నిరుద్యోగ రేటు 3.6 శాతానికి దిగి వచ్చిందని.. సరైన నిపుణులు దొరక్క దాదాపు 1.1 కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. బుధవారం 0.75 శాతం వడ్డీ రేట్లను పెంచిన ఫెడ్ రిజర్వు రాబోయే కాలంలో మాత్రం ఈ స్థాయిలో వడ్డీ రేట్ల పెంపు ఉండదని చెబుతున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. అగ్రరాజ్యం మాంద్యం నీడ పడటం మొదలైందని.. అదెప్పుడు ఉగ్రరూపం దాలుస్తుందన్న విషయం రానున్న రోజుల్లో మరింత స్పష్టత వస్తుందని చెప్పక తప్పదు.