Begin typing your search above and press return to search.

‘భూకంపం’ డేట్ చెప్పేసిన కాంగ్రెస్

By:  Tupaki Desk   |   8 Feb 2017 4:20 AM GMT
‘భూకంపం’ డేట్ చెప్పేసిన కాంగ్రెస్
X
టెక్నాలజీ ఇంతగా పెరిగిపోయినా.. భూకంపం ఎప్పుడు వస్తుంది? ఎక్కడ వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరిక వ్యవస్థలు అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం భూకంపం ఎప్పుడు రానుందన్న విషయాన్ని చెప్పేస్తోంది.అయితే.. ఈ భూకంపం రాజకీయ భూకంపం కావటం గమనార్హం. భూకంపం వచ్చి వెళ్లిపోయిందంటూ కాంగ్రెస్ మాటలకు ప్రధాని మోడీ కౌంటర్ అటాక్ చేసినప్పటికీ.. కాంగ్రెస్ మాత్రం భూకంపం మీద చాలా నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు.. పలువురు కాంగ్రెస్ నేతలు మార్చి 11న వచ్చే భూకంపం మీద భారీ ఆశలే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ.. మార్చి 11కు ఉన్న ప్రాధాన్యత ఏమిటన్న విషయాన్ని చూస్తే.. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 11న వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాలు మోడీ సర్కారుపై ప్రజలకున్న అసంతృప్తిని బయటపెట్టేలా ఉంటాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన పంజాబ్.. గోవాలలో బీజేపీకి ఎదురుదెబ్బ తగలటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. మిగిలినమూడు రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ మినహా.. మిగిలిన రెండు (యూపీ.. మణిపూర్) రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బలు తగలటం ఖాయమన్న మాటను చెబుతోంది. తాము అంచనా వేసినట్లే ఐదు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా యూపీలో కానీ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే.. రాజకీయ భూకంపం ఖాయమన్న భావనను కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది. ‘‘బీజేపీకి ప్రజల్లో ఏపాటి విలువ ఉందో మార్చి 11న ప్రజలే తేల్చిచెబుతారు. తమ తీర్పుతో బీజేపీకి గుణపాటం చెబుతారు’’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మరి.. కాంగ్రెస్ నేతలు ప్రకటించిన భూకంపం నిజంగానే మార్చి 11న వస్తుందా? అన్నది కాలం మాత్రమే సరైన సమాధానం ఇవ్వగలదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/