Begin typing your search above and press return to search.

గీత సవిత కాదు.. డాలీ అంటున్నారు

By:  Tupaki Desk   |   29 Oct 2015 4:31 AM GMT
గీత సవిత కాదు.. డాలీ అంటున్నారు
X
భారత్ నుంచి తప్పిపోయి పాక్ కు చేరి.. పదిహేనేళ్ల తర్వాత భారత్ కు అడుగు పెట్టిన గీత వ్యవహారం రోజురోజుకి చిక్కుముడులు సృష్టిస్తోంది. ఆమె తల్లిదండ్రులకు సంబంధించిన వ్యవహారం ఒక కొలిక్కి రావటం లేదు. భజరంగీ భాయిజాన్ చిత్రంతో గీత వ్యవహారం తెరపైకి వచ్చి.. చివరకు కేంద్ర సర్కారు సైతం కదిలిన పరిస్థితి. దీంతో.. 15 ఏళ్లుగా పాక్ లోనే ఉన్న గీతను.. స్వదేశానికి తీసుకురావటానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి. కేంద్రం స్వయంగా రంగంలోకి దిగటంతో పాక్ నుంచి గీత భారత్ కు వచ్చింది. ఆమె భారత్ కు వచ్చే సమయానికి బీహార్ కు చెందిన ఒక కుటుంబం గీతను తమ కుమార్తెగా పేర్కొన్నారు. అయితే.. భారత్ కు వచ్చిన గీత.. వారిని గుర్తించలేదు. దీంతో.. ఆమె తల్లిదండ్రులు ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక కుటుంబం గీత తమ కుమార్తె అని.. ఆమె పేరు సవిత అని చెప్పటం.. కావాలంటే డీఎన్ ఏ పరీక్షకు అయినా సిద్ధమేనని చెప్పారు. దీంతో గీత తల్లిదండ్రుల విషయం ఒక ఫజిల్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో కుటుంబం గీతను తమ కుమార్తెగా చెబుతున్నారు. అలీగఢ్ జిల్లాలోని అత్రౌలి ప్రాంతానికి చెందిన బాహుల్ సింగ్ దంపతులు గీత తమ కుమార్తెగా చెప్పారు.

2000 నవంబరు 11న తమ కుటుంబం నుంచి తమ కుమార్తె తప్పించుకుందని చెప్పిన బాహుల్.. ఆమె పేరు డాలీగా చెబుతున్నారు. గీత అలియాస్ డాలీ తమ కుమార్తె అని నిరూపించుకోవటానికి డీఎన్ఏ పరీక్షకు తాము సిద్ధమేనని చెప్పారు. గీతను తమ కుమార్తెగా చెబుతున్న వారికి డీఎన్ఏ పరీక్షలు జరిపి.. ఎవరి తల్లిదండ్రులో స్పష్టంగా తేలిన తర్వాతే ఆమెను అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకీ గీత.. సవితా? డాలీనా? లేక మరొకటా..?అన్న​వి శేష​ ​ప్రశ్నలు​.​