Begin typing your search above and press return to search.

గీత మనింటికి ​వచ్చేసింది

By:  Tupaki Desk   |   26 Oct 2015 5:36 AM GMT
గీత మనింటికి ​వచ్చేసింది
X
మన గీత మనింటికి వచ్చేస్తోంది. అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో పాకిస్థాన్ కు చేరిన గీత.. అప్పటి నుంచి ఆ దేశంలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల వయసులో దారి తప్పి.. తల్లిదండ్రుల్ని మిస్ అయిన గీతను పాక్ అధికారులు ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పజెప్పారు. అప్పటి నుంచి సదరు సంస్థ సంరక్షణలోనే గీత ఉండిపోయింది.

ఈ మధ్యన ప్రముఖ బాలీవుడ్ నటుడు నటించిన భజరంగీ బాయిజాన్ చిత్రంలో మూల కథ దాదాపుగా గీతను పోలి ఉండటం.. కాకపోతే.. సినిమాలో పాక్ చిన్నారి తప్పిపోయి భారత్ కు వస్తే.. కథానాయకుడు పాక్ లోకి అక్రమంగా ప్రవేశించి.. ఆ చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పిన వైనం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సమయంలోనే సినిమాలో మాదిరి ఉదంతం ఉందంటూ గీత వ్యవహారం తెరపైకి వచ్చింది.

నిజానికి గీత వ్యవహారం గతంలోమీడియాలో వచ్చిన పెద్దగా పట్టించుకుంది లేదు. కానీ భజరంగీ భాయిజాన్ పుణ్యమా అని మీడియా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం.. కేంద్ర సర్కారు కూడా స్పందించటంతో.. పదిహేనేళ్ల క్రితం జరిగిన గీత ఎపిసోడ్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

గీత తల్లిదండ్రుల్ని గుర్తించేందుకు కేంద్రప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. ప్రచార మాధ్యమాల ద్వారా ఆమె తల్లిదండ్రుల్ని కనుగొనే ప్రయత్నం చేశారు. చివరకు బీహార్ కు చెందిన గీత తల్లిదండ్రుల్ని గీత గుర్తించటంతో కథ ఒక కొలిక్కి వచ్చింది.

ఇక.. భారత సర్కారు గీతను దేశానికి తీసుకొచ్చేందుకు దౌత్య ప్రయత్నాలు షురూ చేసింది. గీత విషయంలో పాక్ సర్కారు సానుకూలంగా స్పందించటంతో ఈ సోమవారం ఉదయం గీత పాక్ నుంచి బయలుదేరి.. ఢిల్లీకి చేరుకుంది. ఆమె వెంట ఇంతకాలం ఆమెను తమ సంరక్షణలో ఉంచుకున్న పాక్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఉన్నారు.

పాక్ నుంచి తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చే సమయంలో గీత ఉన్న స్వచ్ఛంద సంస్థలో తీవ్రమైన భావోద్వేగాలు వ్యక్తమయ్యాయి. ఆమెను వదిలి ఉండలేక హౌస్ లోని పలువురు కన్నీరు కార్చారు. ఆమెకు బహుమతులు ఇచ్చి సాదరంగా తిరిగి పంపారు.

గీత తల్లిదండ్రులుగా భావిస్తున్న వారికి.. గీతకు డీఎన్ ఏ పరీక్షను నిర్వహించిన తర్వాత మాత్రమే గీతను ఆమె తల్లిదండ్రులుగా భావిస్తున్న వారికి అప్పజెబుతారు. అప్పటివరకూ భారతదేశ అతిధిగానే ఆమెను వ్యవహరిస్తారు. గీతను ప్రభుత్వం ప్రత్యేక అతిధిగా పరిగణిచాలంటూ ప్రధాని మోడీ ఇప్పటికే అధికారిక ఆదేశాలు ఇవ్వటం తెలిసిందే.