Begin typing your search above and press return to search.

పాక్ భజరంగీ భాయిజాన్ అవసరం వచ్చింది

By:  Tupaki Desk   |   3 Aug 2015 5:13 AM GMT
పాక్ భజరంగీ భాయిజాన్ అవసరం వచ్చింది
X
రికార్డు కలెక్షన్లే కాదు.. మానవీయ కోణాన్ని సరికొత్తగా స్పృశించి.. సినిమాను చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడ్ని కదిలించేసిన భజరంగీ భాయిజాన్ సినిమాలోని కథ మాదిరే.. ఇప్పుడో రియల్ స్టోరీ తెర మీదకు వచ్చింది.

సల్మాన్ నటించిన భజరంగీ భాయిజాన్ లో మాట్లాడలేని.. వినికిడి లోపం ఉన్న ఒక చిన్నారి ప్రమాదవశాత్తు భారత్ కు వస్తే.. ఆమె తల్లిదండ్రుల్ని వెతికేందుకు భారత్ కు చెందిన ఒక హనుమాన్ భక్తుడు.. అత్యంత సాహసంతో వీసా లేకుండా పాక్ కు వెళ్లి ఆమె తల్లిదండ్రులకు ఆ పాపను చేరుస్తాడు. కుప్లంగా చెప్పాలంటే ఇదీ.. భజరంగీ భాయిజాన్ సినిమా కథ.

రియల్ లైఫ్ కాస్త భిన్నంగా మారింది. సినిమాలో పాకిస్థాన్ పాప భారత్ కు చేరితే.. తాజా ఉదంతంలో మాత్రం భారత్ కు చెందిన ఒక అమ్మాయి పాకిస్థాన్ కు చేరుకుంది. సినిమాలో మాదిరి.. ఈ రియల్ అమ్మాయి మాట్లాడలేదు.. వినికిడి లేనిది కావటం గమనార్హం. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్థాన్ స్వచ్ఛంద సంస్థ ఆమెకు గీత అన్న పేరు పెట్టటమే కాదు.. ఆమె పూజించుకోవటానికి హిందూ దేవతా మందిరాన్ని ఒకటి ఏర్పాటు చేశారు కూడా.

14 ఏళ్ల కింద పాక్ రేంజర్లకు దొరికిన ఆ అమ్మాయికి ఇప్పుడు.. 23 ఏళ్ల యువతి. ఆనందంగా ఉన్నట్లు కనిపించినా.. ఆమె ముఖంలో దిగులు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అప్పుడెప్పుడో తన వాళ్లను మిస్ అయిన ఈ అమ్మాయి.. ఇప్పటికి తన వాళ్ల కోసం తపిస్తుంటుంది.

పాక్ కు చెందిన ఈదీ ఫౌండేషన్ సంరక్షణలో ఉన్న ఈ గీత పెద్దగా చదువుకోలేదు. అయితే.. ఎవరైనా ఇంటి బొమ్మను గీసి ఇస్తే.. ఆనంద పడిపోయే ఆమె.. దాని మీద ‘‘193’’ అనే అంకెను వేస్తుంటుంది. దీన్నిఆమె ఇంటి నెంబరుగా భావిస్తున్నారు. ఆమె దొరికిన నాటి నుంచి దాదాపు 13 ఏళ్ల వరకూ ఆమె అయిన వాళ్ల కోసం విపరీతంగా ప్రయత్నించి.. ప్రస్తుతం ఊరుకుండిపోయిన ఈ సంస్థ.. తాజాగా భజరంగీ భాయిజాన్ చిత్రంతో మళ్లీ గీత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

పెళ్లీడుకు వచ్చిన గీతను.. పాక్ లోని ఎవరైనా హిందు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పినా గీత మాత్రం ససేమిరా అంటుందట. తన వాళ్లను కలిసిన తర్వాతే తనకు పెళ్లి అని చెబుతుందట. భారతదేశం మ్యాప్ ని చూపిస్తే.. ముఖం వెలిగిపోయే ఈ అమ్మాయి.. తన వాళ్ల ఇల్లు ఎక్కడ ఉంటుందని అడిగితే.. మ్యాపులో జార్ఖండ్.. తెలంగాణ ప్రాంతాల్ని చూపిస్తుందట. మరి.. ఈ గీత ఎవరు? ఆమె తల్లిదండ్రులు ఎవరన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పాక్ లోని ఈ గీత కోసం ఏ భజరంగీ భాయిజాన్ బయటకు వస్తారో చూడాలి.