Begin typing your search above and press return to search.

ఈటల మీదకు దింపేటోడ్ని డిసైడ్ చేశారట.. ఇంతకీ ఎవరంటే?

By:  Tupaki Desk   |   3 Aug 2021 3:29 AM GMT
ఈటల మీదకు దింపేటోడ్ని డిసైడ్ చేశారట.. ఇంతకీ ఎవరంటే?
X
తెలంగాణలోనే కాదు.. ఇటు ఆంధ్రాలోనూ.. ఆ మాటకు వస్తే కోట్లాది మంది తెలుగువారిలో ఆసక్తి రేపుతోంది హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. మంత్రివర్గం నుంచి తప్పించిన నేపథ్యంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ నిర్ణయంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈటల బీజేపీలో చేరటం.. ఉప ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనుండటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన పాడె కౌశిక్ రెడ్డి అని అనుకున్నా.. అతనికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చేందుకు కేసీఆర్ డిసైడ్ కావటంతో.. మరి.. అభ్యర్థి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా తమ పార్టీ తరఫున బరిలోకి దింపే అభ్యర్థిని కేసీఆర్ డిసైడ్ చేసినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దింపటం ఖరారైందని చెబుతున్నారు. గెల్లును బరిలోకి దింపుతున్నట్లుగా జిల్లా నేతలకు కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముందుగా కౌశిక్ రెడ్డిని బరిలోకి దించాలని భావించినా.. తర్వాత చోటు చేసుకున్న సమీకరణాల నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెబుతారు.

దళిత బంధుపథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించడానికి ఈ నెల 16న కేసీఆర్ వెళుతున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో బలమైన నాయకుడే అయినా.. ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేకపోవటంతో.. ఆయన్ను మార్చినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై మానుకోటలో జరిగిన రాళ్లదాడిలో కౌశిక్ రెడ్డి పాల్గొన్నట్లుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న వేళ.. ఉద్యమ నేపథ్యంతో పాటు విద్యార్థి సంఘ నేతగా యూత్ కు సుపరిచితుడైన గెల్లుతో తాను అనుకున్నట్లుగా ఈటలకు సరైన అభ్యర్థిగా కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తనకు టికెట్ వస్తుందని ఆశించిన వకుళాభరణం కృష్ణమోహన్‌కు రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పదవి ఇస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా సమాచారం. మొత్తంగా.. ఈటల మీద బరిలోకి దిగే గెల్లు.. కేసీఆర్ కలను నెరవేరుస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. తన ప్రకటనకు ముందే.. పేరు బయటకు రావటంపై సీఎం కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.