Begin typing your search above and press return to search.

సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లే.. మరి సీన్ ఎలా ఉంది?

By:  Tupaki Desk   |   2 May 2022 11:30 PM GMT
సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లే.. మరి సీన్ ఎలా ఉంది?
X
ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. మహా అయితే మరో రెండేళ్లు. మామూలుగా అయితే ఇంకా చాలా కాలముందిగా? అనుకునే పరిస్థితి. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉన్నాయి రోజులు. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే వ్యూహాలు.. ప్రతివ్యూహాలతో రాజకీయ వాతావరణం వేడెక్కిపోతోంది. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్నట్లుగా కొన్నిపార్టీలు ఆలోచిస్తున్నాయి.

ఇలాంటి వేళ.. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే టైం ఉన్న వేళ.. పార్టీలు తమ అస్త్ర శస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే రెండు దఫాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకోవటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

పెట్రోల్.. డీజిల్ ధరలు దారుణంగా పెరిగినప్పటికీ.. ఆయన గ్రాఫ్ మాత్రం చెక్కు చెదర్లేదు. పెట్రోల్.. డీజిల్ ధరల మీద సగటు జీవిలో కోపం ఉన్నా.. అందుకు కారణంగా మోడీ ప్రభుత్వ విధానాలన్న దానిపైనా ఏకీభవించే వారు సైతం.. మోడీకి వ్యతిరేకంగా ఓటు వేయాలన్న దగ్గరకు వచ్చేసరికి మాత్రం.. అందుకు ఒప్పుకోని పరిస్థితి నెలకొంది. ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని చెబుతున్నారు.

రాష్ట్రాల్లో కొంత సీన్ మారుతున్నా.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి కుర్చీలో నరేంద్ర మోడీని కాకుండా మరో నేతను అనుకునే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. దీనికి తోడు గడిచిన పదిహేనేళ్లుగా హిందుత్వం అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. తమను అణగదొక్కుతున్న రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పాలన్న భావనకువస్తున్నారు. ఈ పరిణామం ఇంతకాలం సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే వారికి తెగ ఇబ్బందిగా మారింది. మీది సెక్యులరిజం కాదు.. సూడో సెక్యులరిజమంటూ మండిపడుతున్నారు. అలాంటి వారి చేతులకు అధికారాన్ని అప్పజెప్పేందుకు ఏ మాత్రం సిద్దంగా లేమని చెబుతున్నారు.

ఇలాంటి వాతావరణంలో అందరికి ఓకే అనిపించే పాలకుడిగా నరేంద్ర మోడీ కనిపిస్తున్నారు. ఇది ఆయనకు బోలెడంత అడ్వాంటేజ్ గా చెప్పాలి. ఇప్పటికే ఎనిమిదేళ్లుగా దేశ ప్రధానిగా ఉంటున్న ఆయన పాలనపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికి..మన్మోహన్ సర్కారు వేళ వెలుగు చూసిన కుంభకోణాలేవీ మోడీ సర్కారులో వినిపించకపోవటం.. కనిపించకపోవటంఒక అడ్వాంటేజ్ గా మారింది.

దీనికి తోడు అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్ అంతకంతకూ పెరగటం.. వివిధ దేశాలు భారత్ కు ఇచ్చే ప్రాధాన్యతలో మార్పులు రావటం లాంటి వాటి వెనుక మోడీనే కారణమన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. విశ్వవేదికల మీద గతానికి భిన్నంగా తన సత్తాచాటే విషయంలో వెనక్కి తగ్గట్లేదు. అగ్రరాజ్యాలు ఏ రీతిలో అయితే తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ.. ఆ వాదాన్ని వినిపించే విషయంలో అస్సలు తగ్గవో.. మోడీ సర్కారు అలాంటి తీరునే ప్రదర్శించటం పలువురిని ఆకర్షిస్తోంది. మొత్తంగా చూసినప్పుడు మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న వేళలో.. ఇప్పటికైతే మోడీ మాష్టారు తిరుగులేని ఇమేజ్ తో ఉన్నారని చెప్పక తప్పదు.