Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ఏపీకి ఆ ల్యాబ్ వచ్చేసింది.. దీంతో ఏం జరగబోతుందంటే?

By:  Tupaki Desk   |   4 Jan 2022 5:30 AM GMT
ఎట్టకేలకు ఏపీకి ఆ ల్యాబ్ వచ్చేసింది.. దీంతో ఏం జరగబోతుందంటే?
X
ఏపీ రాష్ట్ర బడ్జెట్ లెక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం పెట్టే ఖర్చు వేలాది కోట్లు ఉంటుంది. చేతికి ఎముక లేనట్లుగా ఖర్చు చేయటంలో ఏపీ తర్వాతే ఎవరైనా. అలాంటి రాష్ట్రంలో వణికించే ఒమిక్రాన్ లాంటి దారుణ వేరియంట్ ను గుర్తించేందుకుఅవసరమైన ల్యాబ్ కోసం వెయిట్ చేయాలా? అంటే మాత్రం ఎవరు సమాధానం చెప్పరు. ఒమిక్రాన్ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. కొన్ని నెలలుగా వింటున్నదే. ఈ వేరియంట్ ను గుర్తించేందుకు ఇప్పుడున్న సాంకేతికత సరిపోదు.

ఈ వైరస్ ను గుర్తించే సాంకేతిక విధానం ఇప్పటివరకు ఫూణె.. హైదరాబాద్ లోని సీసీఎంబీలో మాత్రమే ఉంది. రాష్ట్రాల విషయానికి వస్తే కేరళలో కూడా ఉంది. అలాంటి ల్యాబ్ ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేయటానికి ఏ వందల కోట్లో అవసరం లేదు. కేవలం రూ.2 కోట్లు ఖర్చుతో వచ్చేస్తుంది. ఒమిక్రాన్ కేసులు రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతన్న వేళలో.. ఇప్పుడు సదరు ల్యాబ్ అందుబాటులోకి రావటం గమనార్హం.

జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ గా పిలిచే ఈ ల్యాబ్ ను ఇప్పటి కంటే ముందే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. దేన్ని ముందు.. దేన్ని వెనుక ఏర్పాటు చేయాలన్నదానిపై ప్రభుత్వానికి సరైన వ్యూహం లేకపోవటమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ గురించి వార్తలు వచ్చిన కొద్ది రోజులకే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే ల్యాబ్ ఏర్పాట్లను షురూ చేయటం.. ఇప్పటికే అక్కడ ఆ పరీక్షలు చేయటం మొదలైంది.

అలాంటప్పుడు ఏపీ మాత్రంఎందుకు అంత వేగంగా నిర్ణయాల్ని తీసుకోలేకపోతోందన్న విషయాన్ని ఆలోచించాలి. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ల్యాబ్ ను విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. దీంతో.. ఇప్పటివరకు ఒమిక్రాన్ నిర్దారణ కోసం అయితే ఫూణె.. లేదంటే హైదరాబాద్ లోని సీసీఎంబీ మీద ఆధారపడే అవసరం ఇక ఉండదన్న మాట వినిపిస్తోంది. ఈ ల్యాబ్ కు అవసరమైన సాంకేతిక సహాయాన్ని సీఎస్ఐఆర్.. సీసీఎంబీ అందిస్తుందని చెబుతున్నారు.