Begin typing your search above and press return to search.

రజినీకాంత్ వస్తున్నారు.. కాచుకోండి.?

By:  Tupaki Desk   |   2 Nov 2019 10:39 AM GMT
రజినీకాంత్ వస్తున్నారు.. కాచుకోండి.?
X
అప్పుడెప్పుడో 2017, డిసెంబర్ 31న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ రంగప్రవేశంపై ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికీ రెండేళ్లు గడిచినా రజినీ పార్టీ పెట్టలేదు. అభిమానుల కోరిక తీర్చలేదు. గత 15ఏళ్లు రజినీ కాంత్ రాజకీయాల్లోకి వస్తాడని.. దున్నేస్తాడని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.

అయితే తాజాగా ఒక అప్ డేట్ బయటకు వచ్చింది. రజినీకాంత్ తన పుట్టిన రోజు అయిన డిసెంబర్ 12న కొత్త పార్టీ గురించి ప్రకటిస్తాడని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రజినీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశం కోసం పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే అధినేత జయలలిత మరణంతో ఆ పార్టీ కుదేలైంది. ఇక ప్రతిపక్షం స్టాలిన్ కూడా ఎంపీ ఎన్నికల్లో గెలిచి తాజా ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. తమిళనాట ఏర్పడ్డ ఈ రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకోవడానికి రజినీకాంత్ కు ఇంతకు మించిన సమయం సందర్భం లేదు.

తాజాగా రజినీకాంత్ తన కొత్త పార్టీ కోసం ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ముంబైలో కలిసినట్టు తెలిసింది. ఇక సొంతంగా ఒక టీవీచానెల్ కూడా ప్రారంభించబోతున్నాడట..

అయితే సినిమాల్లో సూపర్ స్టార్లు అయిన చిరంజీవి, పవన్ ల ఘోర ఓటమి తర్వాత రజినీకాంత్ కూడా కేవలం అభిమానాన్ని క్రేజ్ ను వాడుకోకుండా రాజకీయాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి అవసరమైన ఎజెండాను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పార్టీకి మూల స్థంభాలను నియమించాలని వారికి కీలక పదవులు ఇవ్వాలని యోచిస్తున్నారట.. ఇందుకోసం ప్రముఖ నేతల వలసలపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇతర పార్టీల్లోని ముఖ్య నాయకులను చేర్చుకోవడానికి రెడీ అయ్యారట.. ఇలా రజినీకాంత్ వచ్చే ఎన్నికల నేపథ్యంలో కొత్త పార్టీని తెరపైకి తీసుకొస్తున్నట్టు తమిళనాడు నుంచి సమాచారం లీక్ అవుతోంది.