Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వేసుకోండి..స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి !

By:  Tupaki Desk   |   11 Oct 2021 7:16 AM GMT
వ్యాక్సిన్ వేసుకోండి..స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి !
X
కరోనా మహమ్మారి వ్యాక్సిన్ వేసుకునేందుకు జనం ఇంకా అలసత్వం ప్రదర్శిస్తుండడంతో గుజరాత్‌ లోని అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) అధికారులు వినూత్నంగా ఆలోచించారు. వ్యాక్సిన్ వేసుకోండి, స్మార్ట్ ఫోన్ గెలుచుకోండి అంటూ వినూత్న ప్రచారం ప్రారంభించారు. ఏఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాలు వ్యాక్సినేషన్‌ లో వెనుకబడి ఉండడంతో అధికారులు ఈ ప్రోత్సాహకాలు ప్రకటించారు. మరీ ముఖ్యంగా ఇక్కడి మురికివాడల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. దీంతో లక్ష్యాన్ని సాధించేందుకు నడుంబిగించిన అధికారులు టీకా వేయించుకున్న వారికి వంటనూనె ప్యాకెట్లు అందిస్తున్నారు.

అలాగే టీకా వేసుకున్న వెంటనే ఓ కూపన్ అందిస్తున్నారు. ఈ కూపన్లకు డ్రా తీసి గెలుపుపొందిన వారికి రూ. 10 వేల విలువైన ఫోన్లు అందిస్తున్నారు. ఒక్క శనివారమే 10 వేల వంటనూనె ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ విషయం తెలియడంతో ఆదివారం టీకా వేయించుకునేందుకు జనం పోటెత్తారు. నిన్న ఏకంగా 20 వేల నూనె ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తీసిన లక్కీ డ్రాలో ఇప్పటి వరకు 25 మంది సెల్‌ ఫోన్లు గెలుచుకున్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో యువ అన్‌ స్టాపబుల్ ఆర్గనైజేషన్ సహకరిస్తోందని ఏఎంసీ అధికారి ఒకరు తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసగుతుంది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ 100 కోట్లకు చేరువలో ఉంది. ఇండియా వ్యాక్సినేషన్ డ్రైవ్.. ఆదివారం రోజున 95 కోట్ల మైలురాయిని దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద విజయవంతమైన టీకా డ్రైవ్ ఫుల్ స్వింగ్‌ లో కొనసాగుంది. భారతదేశం 95 కోట్ల వ్యాక్సిన్ డోస్‌ ల వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను చేరుకునే దిశగా వేగంగా ముందుకు వెళ్తుంది. త్వరగా టీకాలు వేయించుకోండి. అలాగే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను వ్యాక్సిన్ వేయించుకునే విధంగా ప్రోత్సహించండి అని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు.

కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమయ్యింది. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు. ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. మార్చి 1న మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభమయింది. ఇందులో 60 ఏండ్లు పైబడినవారికి, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏండ్లు పైబడినవారికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏండ్లు పైబడినవారికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగం పుంజుకుంది.