Begin typing your search above and press return to search.

గూగుల్ పే, పేటీఎంలతో ఓట్లను కొనేస్తున్నారు

By:  Tupaki Desk   |   22 Jan 2020 6:26 AM GMT
గూగుల్ పే, పేటీఎంలతో ఓట్లను కొనేస్తున్నారు
X
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కొత్త పుంతలు తొక్కింది. మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున ఓట్లను కొనుగోలు చేశారు. ఓటుకు నోటును పంచారు. బుధవారం ఎన్నికల సందర్భంగా తెలంగాణ మున్సిపల్ అభ్యర్థులు రెచ్చిపోయారు.

తెలంగాణ మున్సిపాలిటీల్లో ప్రధానం గా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి మొత్తం 15,843మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 53 లక్షలకు పైగా ఉన్న ఓటర్లను ప్రభావితం చేశారు.

ఈసారి రాజకీయ పార్టీలన్నీ నిఘా తీవ్రంగా ఉండడం తో ఓటర్ల ను ఆకర్షించడానికి కొత్త ఉపాయాలను కనుగొన్నారు. గత రాత్రి అధికార, ప్రతిపక్షాల అభ్యర్థులు ఓటర్లకు డబ్బుల పంపిణీలో తలమునకలయ్యారు. తెలంగాణలోని జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీ వార్డుల్లో రూ.1000-రూ.5000 వరకూ పంపిణీ చేయగా.. హైదరాబాద్ శివారుల్లో ఒక ఓటుకు 10వేల వరకూ పంచారు.

పోలీసుల నిఘా తీవ్రంగా ఉండడం.. ప్రత్యర్థుల్లో వార్డుల్లో కాపుకాయడం తో ఈసారి అభ్యర్థులు సాంకేతికత వినియోగించి ఓట్లను కొనుగోలు చేశారు. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే ద్వారా ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభాలకు గురిచేశారు. యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్టు తెలిసింది. ఇలా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ తొలిసారి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలతో డబ్బుల పంపిణీ చేసి కొత్త పుంతలు తొక్కించారు.