Begin typing your search above and press return to search.

జీహెచ్‌ఎంసీకి ఈ బాధ పట్టదా?

By:  Tupaki Desk   |   10 July 2015 8:01 AM GMT
జీహెచ్‌ఎంసీకి ఈ బాధ పట్టదా?
X
సామాన్యుల బాధలు తొలగించేందుకు అంటూ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఇపుడు శ్రద్ధ కారణంగా నీరుగారిపోతోంది. పథకాన్ని ప్రారంభించిన సమయంలో చూపించిన చొరవ ఇపుడు లేకపోవడంతో....మంచి ఉద్దేశం కాస్త విఫలం అవుతోందనే ే భావన వ్యక్తమవుతోంది.

నగరంలో అర్దాకలితో బతుకుతున్న వారికి తక్కువ ధరకు భోజనం అని పేర్కొంటూ జీహెచ్‌ఎంసీ రూ. 5 భోజన కేంద్రాలను ప్రారంభించింది. హైదరాబాద్‌ నగరంలో మొత్తం 34 భోజన కేంద్రాలను ఏర్పాటు చేసింది. పథకం ప్రారంభించిన కొత్తలో భోజనం కాస్త రుచిగా, బాగుండేది. అన్నం, పప్పు, కూర, చట్నీ, మజ్జిగ అన్నీ ఉండేవి. దీంతో చిన్న చిన్న కూలీపనులు చేసుకునేవారు, ఆటోవారు బాగానే ఆసక్తి చూపించారు. హైదరాబాద్‌ నగరంలోనే ప్రముఖమైన సిటీ లైబ్రరీ వద్ద ఏర్పాటు చేయగా మంచి స్పందనే దక్కింది. అయితే రానురాను భోజనంలో నాణ్యత తగ్గుతోందనే భావన వ్యక్తమవుతోంది.

తాజాగా కేవలం ఏదో నామ్‌ కే వాస్తీ అన్న చందంగా ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇపుడు అన్నం, పప్పు, మజ్జిగ మాత్రమే అందిస్తున్నారని వాపోతున్నారు. పుచ్చిపోయిన పప్పుతో కూర వండుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఆకలి మంటకే తప్ప తృప్తిగా భోజనం చేయడం లేదని వాపోతున్నారు.

విశాల హృదయంతో చేపట్టిన ఈ పథకానికి కాంట్రాక్టర్ల చేతివాటంతో ఈ ఇబ్బంది ఎదురవుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి మంచి మనసుతో చేపట్టిన కార్యక్రమాన్ని అదే రీతిలో ముందుకు పోయేలా చూడాలని కోరుతున్నారు.