Begin typing your search above and press return to search.

రెండు ఓట్లు ఉంటే కేసు పెడతారట

By:  Tupaki Desk   |   30 Nov 2015 4:23 AM GMT
రెండు ఓట్లు ఉంటే కేసు పెడతారట
X
కొన్ని విషయాల మీద అవగాహన ఉండి కొందరు.. అవగాహన లేకుండా మరికొందరు వ్యవహరిస్తుంటారు. ఇందులో ప్రజల తప్పు ఎంత ఉంటుందో.. ప్రభుత్వానిది అంతే తప్పు కనిపిస్తుంది. ఓట్లు రెండు ఉండటం తప్పే. దాన్ని ఎవరూ వెనుకేసుకురారు. కానీ.. అలాంటి పరిస్థితి ఎందుకు ఉన్నదన్నది ఒక పెద్ద సమస్య. ఒక వ్యక్తి ఒకచోటు నుంచి మరో చోటకు వెళ్లే నేపథ్యంలో కొత్త ఓటును నమోదు చేసుకుంటాడు.

ఇలాంటి సమయంలో పాత ఓటును తొలగించుకోవాలని అధికారులు చెబుతారు. ప్రభుత్వం చెప్పే మాటను ప్రభుత్వానికే చెబితే.. ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో ఓటు ఉండి.. మరో ప్రాంతంలో ఓటు కోసం అప్లై చేసుకున్న వెంటనే.. పాత ఓటు రద్దు అయ్యే సాఫ్ట్ వేర్ ఉంటే అసలు ఇబ్బందే ఉండదు కదా. ఎందుకంటే.. రెండు ఓట్లు ఉన్న వారంతా కావాలని చేయరు. అవగాహనారాహిత్యంతో చేస్తుంటారని మర్చిపోకూడదు. దీనికి తోడు ఓటు తొలగింపు ప్రక్రియ ఈజీగా ఉండకపోవటం కూడా దీనికో కారణం. సందు చివర కిరాణం షాపులో బిస్కెట్ పాకెట్ కొనుగోలు చేసినంత ఈజీగా.. ఓట్ల నమోదు.. ఓట్లు తొలగింపు అవకాశం ఉండి.. ప్రజలకు ఆ అంశం మీద అవగాహన కల్పించిన తర్వాత కూడా ప్రజలు తప్పు చేస్తే.. అప్పుడు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. రెండు ఓట్లు ఉంటే.. మీ మీద కేసులు నమోదు చేస్తామని సింఫుల్ గా పత్రికల్లో ఒక ప్రకటన చేయటం సబబుగా అనిపించదు.

తాజాగా హైదరాబాద్ గ్రేటర్ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. హైదరాబాద్ లో రెండు ఓట్లు ఉన్న వారు వెంటనే.. తమ ఓట్లను తొలగించుకోవాలని.. లేదంటే వారిపై కేసులు నమోదు చేస్తామని చెబుతున్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే.కానీ.. అందులో కాస్తంత అర్థం ఉండాలన్న విషయం మర్చిపోకూడదు. ఒకవేళ.. జీహెచ్ఎంసీ కమిషనర్ చెబుతున్నట్లుగా రెండు ఓట్లు ఉన్న వారి మీద కేసులు నమోదు చేస్తామన్నట్లే.. ఓట్లను ఇష్టారాజ్యంగా తొలగించిన అధికారులపై ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎన్ని ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు..? ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారో కూడా చెబితే బాగుంటుంది. తప్పులకు సంబంధించి.. వాటిని అరికట్టేందుకు చర్యలు ఒకవైపు నుంచి కాకుండా.. రెండు వైపుల నుంచీ మంచిది. మరి.. ఆ విషయంలో గ్రేటర్ బాస్ కాస్తంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది.