Begin typing your search above and press return to search.

సంక్రాంతి టైంలోనే గ్రేటర్ వార్..?

By:  Tupaki Desk   |   4 Nov 2015 4:05 AM GMT
సంక్రాంతి టైంలోనే గ్రేటర్ వార్..?
X
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కోర్టు జోక్యంతో.. వచ్చే ఏడాది జనవరి 31లోపు గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తును అధికార యంత్రాంగం మొదలు పెట్టింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గ్రేటర్ ఎన్నికల నిర్వహణలో తెలంగాణ అధికారపక్షంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని విపక్షాలు విరుచుకుపడటం తెలిసిందే.

గ్రేటర్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్లలో దాదాపు 35 శాతం వరకున్న సీమాంధ్రులు ఓట్లు వేయకుండా ఉండేలా.. సంక్రాంతి పండుగ సమయంలో ఎన్నికలు నిర్వహించే అవకావం ఉందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. విపక్షాలు విమర్శించిన చందంగానే పండుగకు కాస్త అటూఇటుగానే ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. అధికారిక వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జనవరి 16 నుంచి 20 మధ్యలో పోలింగ్ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. ఈ తేదీలను ఎన్నికల సంఘం ఖరారు చేయాల్సి ఉంటుంది.

జనవరి 31లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో జనవరి 17 ఆదివారం ఎన్నికలు నిర్వహించే వీలుందని చెబుతున్నారు. ఒకవేళ ఇదే తేదీన ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం పోలింగ్ లో పాల్గొనే వారి సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. పండుగ తర్వాత వచ్చే ఆదివారం కావటంతో ఊళ్లకు వెళ్లే వారు తిరిగి వచ్చేది ఆదివారమే అవుతుందని.. అదే జరిగితే గ్రేటర్ పోలింగ్ మీద ప్రభావం చూపుతుందన్న మాట వినిపిస్తోంది. అధికారికంగా తేదీలు ఖరారు అయితే.. ఇలాంటి విమర్శలు చేయొచ్చని.. అంతే కానీ అంచనాలతో ఎలా విమర్శిస్తారంటూ తెలంగాణ అధికారపక్షం నేతలు విపక్షాలు చేస్తున్న విమర్శల్ని తప్పు పడుతున్నారు.