Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ నేతకు 25వేల జరిమానా

By:  Tupaki Desk   |   9 March 2019 6:06 AM GMT
టీఆర్ ఎస్ నేతకు 25వేల జరిమానా
X
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ ఎంసీ) అధికార - ప్రతిపక్షాలన్న తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తోంది. జరిమానాలతో వాయించేస్తోంది. టీఆర్ ఎస్ అధికారంలో ఉంది కదా అని రెచ్చిపోతున్న ‘ఫ్లెక్సీ’రాయుళ్లకు చుక్కలు చూపిస్తోంది. కేసీఆర్ - కేటీఆర్ ఫ్లెక్సీలు పెట్టినా ఊరుకునేది లేదంటూ జీహెచ్ ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇటీవలే ఎల్బీనగర్ లో జరిగిన ఫ్లై ఓవర్ నిర్మాణం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుడికి రూ.25వేల జరిమానాను జీహెచ్ ఎంసీ వేసి షాక్ ఇచ్చింది. గతంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన ముసారంబాగ్ కార్పొరేటర్ కు - పటాన్ చెరు నియోజకవర్గంలోని ఓ కార్పొరేటర్ కు కూడా జరిమానాలను జీహెచ్ ఎంసీ అధికారులు విధించారు.

ఇప్పుడు తాజాగా పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని అభిమానులకు జీహెచ్ ఎంసీ షాక్ ఇచ్చింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా తలసానిని అభినందిస్తూ నెక్లస్ రోడ్డు ప్రధాన రహదారిపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బాలరాజ్ అనే టీఆర్ ఎస్ నాయకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై సీరియస్ అయిన ఖైరతాబాద్ సర్కిల్ అధికారులు ఆయనకు రూ.25వేల జరిమానా విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎవ్వరైనా ఊరుకునేది లేదని జీహెచ్ ఎంసీ స్పష్టం చేసింది.

హైదరాబాద్ సుందరీకరణకు భంగం కలిగించే విధంగా ఉన్న ఫ్లెక్సీ బ్యానర్ల ఏర్పాటును నిషేధించామని ప్రతిఒక్క పార్టీ - నాయకులు దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని మేయర్ రామ్మోమన్ కోరారు. ఎవ్వరూ అతిక్రమించినా.. వారు టీఆర్ ఎస్ నేతలైనా ఊరుకోమని హెచ్చరించారు.