Begin typing your search above and press return to search.

జీహెచ్‌ఎంసీలో మ‌రో క‌ల‌క‌లం: మేయ‌ర్ డ్రైవ‌ర్‌కు పాజిటివ్‌

By:  Tupaki Desk   |   11 Jun 2020 3:15 PM GMT
జీహెచ్‌ఎంసీలో మ‌రో క‌ల‌క‌లం: మేయ‌ర్ డ్రైవ‌ర్‌కు పాజిటివ్‌
X
మ‌హ‌మ్మారి వైర‌స్ తెలంగాణ‌ను ఉక్కిరిబిక్కి‌రి చేస్తోంది. ముఖ్యంగా రాజ‌ధాని హైద‌రాబాద్‌తోపాటు ప‌రిస‌రాల్లో భారీగా కేసులు న‌మోద‌వుతున్నాయి. రోజుకు వంద‌కు పైగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో కేసులు న‌మోద‌వడం ఆందోళ‌న రేపుతున్న విష‌యం. ఇప్ప‌టికే వైర‌స్ నుంచి కాపాడుతున్న చాలామందికి పాజిటివ్ సోకింది. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో ప‌లువురికి వైర‌స్ సోకింది. ఇప్పుడు మ‌రో వార్త జీహెచ్ఎంసీని ప్ర‌మాదంలో ప‌డేసింది. తాజాగా మేయర్ బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవర్ వైర‌స్ బారిన పడ్డాడు.

గురువారం నిర్వహించిన పరీక్షల్లో అతడికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో మేయ‌ర్ బిజీబిజీగా ఉన్నాడు. విధుల్లో భాగంగా మేయ‌ర్‌తో పాటు డ్రైవ‌ర్ కూడా విస్తృతంగా తిరిగాడు. పాజిటివ్ తేలేంత వ‌ర‌కు కూడా మేయర్‌తో పాటే ఉన్నాడు. దీంతో ఆందోళ‌న రేపుతోంది. అత‌డికి పాజిటివ్ వ‌చ్చింద‌నే విష‌యంతో మేయ‌ర్ రామ్మోహ‌న్ అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. మేయ‌ర్ కుటుంబంతో స‌హా హోం క్వారంటైన్‌లోకి వెళ్లాడు. అత‌డికి వైర‌స్ సోక‌డంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మై అతడు ఎవరెవరిని కలిశాడన్న విష‌యమై ఆరా తీస్తోంది. డ్రైవ‌ర్‌కు వైర‌స్ రావ‌డంతో శుక్ర‌వారం మేయర్‌తో పాటు అతడి కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

అయితే విధుల్లో భాగంగా న‌గ‌ర‌మంతా మేయ‌ర్ రామ్మోహ‌న్ ప‌ర్య‌టిస్తుండ‌డంతో అత‌డికి వైర‌స్ సోకిందేమోన‌నే అనుమానంతో నాలుగు రోజుల కింద‌ట పరీక్షలు నిర్వహించారు. దీనిలో నెగటివ్‌ అని తేలింది. ఇప్పుడు డ్రైవ‌ర్‌కు వైర‌స్ పాక‌డంతో జీహెచ్ఎంసీ అప్ర‌మ‌త్త‌మైంది. నిర్వ‌హించే ప‌రీక్ష‌ల్లో మేయ‌ర్ రామ్మోహ‌న్ కు కూడా పాజిటివ్ తేలితే సంచ‌ల‌నం రేపే అవ‌కాశం ఉంది.