Begin typing your search above and press return to search.

హైద‌రాబాదీల‌కు మ‌రో గుడ్ న్యూస్‌

By:  Tupaki Desk   |   22 March 2016 6:54 AM GMT
హైద‌రాబాదీల‌కు మ‌రో గుడ్ న్యూస్‌
X
హైద‌రాబాదీల‌కు మ‌రో గుడ్ న్యూస్‌. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ త‌న సిటిజ‌న్లకు టెక్నాల‌జీ సౌల‌భ్యాన్ని అందించ‌బోతోంది. ఇప్పటివరకు ఆహ్లాదాన్ని - ఆరోగ్యాన్ని పంచుతున్న పార్కుల్లో వైఫై సేవలు అందించాలని జీహెచ్‌ ఎంసీ వ‌ర్గాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇకపై పార్క్ కు వచ్చేవారు తమ వద్ద స్మార్ట్ ఫోన్‌ - ల్యాప్‌ టాప్‌ - ట్యాబ్లెట్‌ ఏది ఉన్నా.. ఎంచక్కా వైఫై సేవలు పొందవచ్చు. న‌గరంలోని అనేక పార్కులకు ప్రతిరోజు లక్షలాది మంది సందర్శకులు వ‌స్తున్న నేప‌థ్యంలో ఫ్ర్రీ వైఫై సేవలు అందించడం వల్ల మ‌రింత‌గా ఆహ్లాదం అందించే దిశ‌గా ప్ర‌ణాళికలు సిద్ధ‌మ‌య్యాయి.

ఈ ఉచిత వైఫై సౌల‌భ్యం ప్ర‌కారం తొలి 45 నిమిషాలు ఉచితంగా ఇంటర్నెట్‌ ను ఎంజాయ్‌ చేయవచ్చు. మొదటి దశలో 19 ప్రధాన పార్కుల్లో ఈ వైఫై సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఇందిరాపార్క్‌ - సుందరయ్యపార్క్‌ - కృష్ణకాంత్‌ పార్క్‌ - జలగం వెంగళరావు పార్క్ - చాచానెహ్రూ పార్క్ - ఇమ్లీబన్‌ పార్క్ లు ఉన్నాయి. ఆక్ట్‌ ఫైబర్‌ నెట్‌ సంస్థ సిటీలోని 19 పార్కుల్లో వైఫై సేవలను అందించేందుకు ముందుకువచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ జీహెచ్‌ ఎంసీ ప్రధాన కార్యాలయంలో సందర్శకుల కోసం 45 నిమిషాలు ఉచితంగా వైఫైని అందిస్తోంది. ఇక్కడి అనుభవాలతో పార్కుల్లోనూ వైఫై విస్తరణకు జీహెచ్‌ ఎంసీ పచ్చజెండా ఊపింది.

ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ముఖ్యమైన పర్యాటక కేంద్రాలైన నెక్లెస్‌ రోడ్‌ - ట్యాంక్‌ బండ్‌ - చార్మినార్‌ - బిర్లామందిర్‌ - పబ్లిక్‌ గార్డెన్‌ - శిల్పకళావేదిక - శిల్పారామంలలో ఫ్రీ వైఫై అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఎంజీబీఎస్‌ - జేబీఎస్‌ లతో పాటు.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లలో బీఎస్‌ ఎన్‌ ఎల్‌ - క్యాడ్‌జెన్‌ సంస్థ సంయుక్తంగా వైఫై సౌకర్యాన్ని కలిగిస్తోంది. గ్రేటర్‌ పరిధిలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వైఫై సేవలు ఉండగా.. ఆ జాబితాలోకి పార్కులు కూడా చేరబోతున్నాయి. దీంతో ఇకపై పార్కులకు వచ్చే సందర్శకులు ఆహ్లాదం - ఆరోగ్యంతోపాటు.. వైఫైను కూడా ఎంజాయ్‌ చేయొచ్చు.