Begin typing your search above and press return to search.

ఇవాంక కోసం పెట్టిన ఖ‌ర్చు లెక్క ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   28 Nov 2017 7:23 AM GMT
ఇవాంక కోసం పెట్టిన ఖ‌ర్చు లెక్క ఎంతో తెలుసా?
X
ఇవాళ ఏ నోట విన్నా.. రెండే రెండు మాట‌లు వినిపిస్తున్నాయి. ఏ ఛాన‌ల్ పెట్టినా ప్ర‌ముఖంగా క‌నిపించే అంశాలు రెండే రెండు. అందులో ఒక‌టి ఇవాంక‌.. రెండోది హైద‌రాబాద్ మెట్రో రైల్‌. ఇవాంక ఛ‌రిష్మా ముందు మెట్రో రైల్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం చిన్న‌బోయింది. ఆ మాట‌కు వ‌స్తే మెట్రో రైలు ప్రారంభాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు కూడా. మామూలుగా అయితే.. మెట్రో రైల్ ప్రారంభం ఒక పండుగ మాదిరి ఉండేది. కానీ.. ఇవాంక దెబ్బ‌కు పెద్ద‌గా హైలెట్ కాలేదు.

మ‌రి.. ఇవాంక రావ‌టం వ‌ల్ల తెలంగాణ రాష్ట్రానికి క‌లిగే ప్ర‌యోజ‌నం.. హైద‌రాబాద్ న‌గ‌రానికి జ‌రిగే లాభం ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. భారం మాత్రం భారీగా ప‌డింద‌ని చెప్పాలి. అస‌లు అప్పుల‌తో కిందా మీదా ప‌డుతున్న జీహెచ్ ఎంసీకి ఇవాంక టూర్ పుణ్య‌మా అని తీరిపోయింది. నో ప్రోటోకాల్ పేరుతో జీహెచ్ ఎంసీ మేయ‌ర్ తో పాటు.. నేత‌లు.. కీల‌క అధికారులు ఎవ్వ‌రూ బిజినెస్ స‌మ్మిట్‌ కు హాజ‌రు కావ‌టం లేదు.

జీహెచ్ ఎంసీకి.. ఆ మాట‌కు వ‌స్తే తెలంగాణ రాష్ట్ర స‌ర్కారుకు ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నం పెద్ద‌గా లేద‌నే చెప్పాలి. ఇవాంక హాజ‌రుతో మ‌రోసారి హైద‌రాబాద్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక్క‌సారి అంద‌రి దృష్టిలో ప‌డుతుంద‌న్న విష‌యాన్ని వ‌దిలేస్తే.. అమెరికా నుంచి వ‌చ్చే వెంచ‌ర్ క్యాప‌ట‌లిస్ట్ లు ఎంతగా పెట్టుబ‌డులు పెడ‌తారన్న దానిపై ఎవ‌రూ స్ప‌ష్ట‌మైన స‌మాధానాన్ని చెప్ప‌లేక‌పోతున్నారు.

ఇదిలా ఉంటే.. ఖ‌ర్చు విష‌యానికి వ‌స్తే.. ఒక్క రోడ్ల కోసం.. బ్యూటిఫికేష‌న్ కోస‌మే దాదాపు రూ.100 కోట్లకు పైనే ఖ‌ర్చు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. రోడ్ల కోసం సుమారు రూ.60 కోట్ల‌కు పైనే ఖ‌ర్చు చేస్తే.. బ్యూటిఫికేష‌న్ కోసం సుమారు రూ.44 కోట్ల‌కు పైనే ఖ‌ర్చు జ‌రిగింది. అంటే.. ఈ రెండింటికి ఖ‌ర్చు అంతిమంగా రాష్ట్ర స‌ర్కారు మీద కాకుండా జీహెచ్ ఎంసీ మీద ప‌డింది. ఇక‌.. భ‌ద్ర‌త కోసం.. ఇత‌ర ఏర్పాట్ల కోసం పెట్టిన ఖ‌ర్చును లెక్కేస్తే దాదాపు మ‌రో రూ.100 కోట్ల వ‌ర‌కూ అవుతుంద‌న్న మాట వినిపిస్తోంది. ఇది జీహెచ్ ఎంసీ మీద నేరుగా భారం ప‌డ‌న‌ప్ప‌టికీ.. తెలంగాణ ప్ర‌భుత్వం బొక్క‌సం మీద ప‌డ‌టం ఖాయం. ఇక‌.. ఆమె రక్ష‌ణ కోసం చేస్తున్న ఏర్పాట్లు.. భ‌ద్ర‌త కోసం ట్రాఫిక్ డైవ‌ర్ష‌న్లు.. దాని కార‌ణంగా సామాన్యులు ప‌డే ఇబ్బందుల్ని డ‌బ్బు కోణంలో ఆలోచించి లెక్కేస్తే.. ట్రంప్ కూతురు రావ‌టం ఏమో కానీ ఖ‌జానాకు.. ప్ర‌జ‌ల‌కు ఓ రేంజ్లో తీరిపోవ‌టం ఖాయం.