Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మహానగరిలో వాటర్ ఎటీఎంలు?

By:  Tupaki Desk   |   23 Feb 2016 4:13 AM GMT
హైదరాబాద్ మహానగరిలో వాటర్ ఎటీఎంలు?
X
నీళ్లు అమ్ముకునే పాడు రోజులు వచ్చేశాయని పలువురు ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. ముందుచూపు అన్నది లేని నాయకులకు.. విలువైన సహజవనరుల్ని ఎంత జాగ్రత్తగా వినియోగించాలన్న అంశంపై అవగాహన తక్కువగా ఉండే ప్రజల వైఖరి.. వారి మైండ్ సెట్ ను మార్చే విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వెరసి.. నీటి సమస్య రోజురోజుకీ పెరిగిపోతున్న దుస్థితి. ఈ రోజు లీటర్ నీళ్లు రూ.20 పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. నిజానికి దీనికి ప్రజలు కూడా అలవాటు పడిపోయారు కూడా.

అయితే.. ఈ భారాన్ని తగ్గించే దిశగా జీహెచ్ ఎంసీ కమిషనర్.. జలమండలి ఎండీ సరికొత్త విధానాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఉన్న బ్యాంక్ ఏటీఎంల మాదిరే.. మంచినీళ్లకు కూడా ఏటీఎంలను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం వాటర్ ఏటీఎంలను నగరంలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రూపాయి బిళ్ల వేసినంతనే లీటర్ నీళ్లు వచ్చేలా మెషిన్లను ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని రోడ్ల పక్కనే ఇలాంటి వాటర్ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు.

త్వరితగతిన వాటర్ కియోస్క్ లను అందుబాటులోకి తెస్తున్నట్లుగా జనార్దన రెడ్డి చెబుతున్నారు. ఒకవేళ ఆయన చెబుతున్నట్లు వాటర్ ఎటీఎంలను విరివిగా ఏర్పాటు చేస్తే.. గ్రేటర్ ప్రజల నెత్తిన పాలు పోసినట్లే. బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లినా.. తీసుకెళ్లిన నీళ్లు అయిపోతే.. మినరల్ వాటర్ కోసం భారీగా ఖర్చుచేయాల్సి వస్తోంది. వాటర్ ఏటీఎంల పుణ్యమా అని ఇలాంటి ఇబ్బంది తీరటంతో పాటు.. ఆర్థికంగా వెసులుబాటు.. అనారోగ్యానికి దూరంగా ఉండే వీలు ఉంటుంది.