Begin typing your search above and press return to search.

దేశ రాజ‌ధానిని మించిపోయిన తెలుగు రాజ‌ధాని

By:  Tupaki Desk   |   30 Nov 2016 5:57 AM GMT
దేశ రాజ‌ధానిని మించిపోయిన తెలుగు రాజ‌ధాని
X
పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం హైద‌రాబాద్ ను ఓ విష‌యంలో దేశంలోనే నంబ‌ర్ 1గా నిలిపింది. ర‌ద్ద‌యిన పాత పెద్ద నోట్లను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ప్రజానీకం అగ్ర‌స్థానంలో నిలిచారు. నోట్ల రద్దు తర్వాత ఇంకే రాష్ట్రం లోనూ లేనంత‌గా తెలంగాణ‌లో భారీగా పన్ను వసూళ్లు పెరిగాయి. అన్ని స్థానిక సంస్థలకు పాత నోట్ల చెల్లుబాటు నిర్ణయం వరంగా మారింది. పాత నోట్లను పన్నుల చెల్లింపులకు కేంద్రం అనుమతించడంతో స్థానిక సంస్థలకు రెవెన్యూ ఆదాయం గణనీయంగా పెరిగింది. నవంబర్‌ నెలలో స్థానిక సంస్థల పన్నుల వసూళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ లో పన్నుల వసూళ్లు 2500 శాతంతో దేశంలోనే నెంబర్‌ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది నవంబర్‌లో రెవెన్యూ వసూళ్లు రూ. 489 కోట్లు ఉండగా తాజాగా నోట్ల రద్దు తర్వాత ప్రజలకిచ్చిన ఆఫర్‌ తో మంగళ వారానికి అవి రూ. 1722 కోట్లుగా నమోదయ్యాయి. తర్వాత స్థానంలో ఢిల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ 2434 శాతం పన్ను రెవెన్యూను సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 2314 శాతం పన్ను రెవెన్యూలను ఆర్జించగా - దక్షిణ ఢిల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ 2037శాతం పన్నులను వసూలు చేసింది. రాజ్‌ కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో 1275 శాతం పన్ను వసూళ్లు రికార్డును సృష్టించాయి.

పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం స్థానిక సంస్థలకు పన్నుల వసూలుకు పాత నోట్లను తీసుకోవచ్చంటూ మినహాయింపునిచ్చింది. ఈ నిర్ణయం నిధుల కొరతతో సతమతమవుతున్న స్థానిక సంస్థలకు పెద్ద వరంగా పరిణమించింది. భారీగా ప్రచారాలను నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తేవడంతో నీటి పన్నులు - ఇంటి పన్నులు - ఆస్థి పన్నులు - బకాయి పన్నులను చెల్లించేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లోనే నీటి - విద్యుత్‌ - ఆస్తి పన్నుల చెల్లింపులు భారీగా పెరిగాయి. మరోవైపు పెద్ద నోట్ల డిపాజిట్లకు అనుమతించిన ప్రభుత్వం పెద్ద మొత్తాలపై నిఘా పెట్టడంతో పన్నుల చెల్లింపులకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఒక విధంగా ఇది నిధుల లేమితో ఉన్న స్థానిక పాలనా మండళ్లు - సంస్థల అభివృద్ధి పథకాలు - ప్రజల అవసరాల తీర్చేందుకు వనరులుగా మారనున్నాయి.

మొత్తానికి నోట్ల ర‌ద్దు పుణ్య‌మా అని జీహెచ్ ఎంసీ క‌ష్టాలు తీరిన‌ట్లుగా క‌నిపిస్తోంది. అయితే.... అంతా ప‌న్నుల వ‌సూళ్ల‌నే చూస్తున్నా దేశ రాజ‌ధానిని మించిపోయేలా పాత‌నోట్ల‌తో ప‌న్నులు వ‌సూల‌య్యాయంటే హైద‌రాబాద్ లో న‌ల్ల‌ధ‌నం ఏ స్థాయిలో ఉందన్న‌ది అర్థ‌మ‌వుతోంద‌న్న వాద‌నా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/