Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఎన్నికలకు ఓటర్లు ఇందుకే దూరమయ్యారా ?

By:  Tupaki Desk   |   2 Dec 2020 12:30 PM GMT
గ్రేటర్ ఎన్నికలకు  ఓటర్లు ఇందుకే దూరమయ్యారా ?
X
మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో ఓటర్లు రాజకీయ పార్టీలకు పెద్ద షాకే ఇచ్చారు. మంగళవారం జరిగిన పోలింగుకు ఓటర్లు పెద్దగా స్పందించలేదు. చాలా పోలింగ్ కేంద్రాల్లో అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు అసలు ఓటర్లే కనబడలేదు. పోలింగ్ జరిగిన తీరు చూస్తే ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

కడపటి వార్తలు అందే సమయానికి మొత్తం పోలింగ్ 45 శాతం జరిగినట్లు చెబుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన జరగాల్సుంది. కాబట్టి ఇపుడు చెప్పుకుంటున్న ఓటింగ్ శాతం ఫైనల్ అనుకునేందుకు లేదు. ఏదేమైనా ఇంతటి దారుణమైన పోలింగ్ శాతాన్ని రాజకీయపార్టీలు ఊహించనట్లు లేదు. అందుకనే పార్టీలన్నీ షాక్ కు గురయ్యాయి. చివరకు వివిధ పార్టీల నేతలు ఓటు హక్కు వినియోగంపై ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఓటర్లయితే ఎవరినీ పట్టించుకోలేదు.

పోలింగ్ జరిగిన తీరుకు ఒక విధంగా ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సొస్తే మరో విధంగా చూస్తే రాజకీయపార్టీలనే నిందించక తప్పదు. ఈమధ్య కురిసిన భారీ వర్షాలకు గ్రేటర్ పరిధిలో సుమారు 200 కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేయటంతో వేలాదిమంది జనాలు రోజుల తరబడి నానా ఇబ్బందులు పడ్డారు. జనాలు ఎంత ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధుల్లో ఎవరు కూడా కాలనీల్లోకి వెళ్ళి సహాయ చర్యలు చేయలేదు. తర్వాత గ్రేటర్ ఎన్నికలు వచ్చేసరికి అధికారపార్టీ ప్రజా ప్రతినిధులంతా కాలనీల్లో ప్రత్యక్షమయ్యారు.

సమస్యలు వచ్చినపుడు రాకుండా ఎన్నికల కోసం వచ్చిన వాళ్ళని చూసిన జనాలు చాలా చోట్ల వాళ్ళని నోటికొచ్చిన తిట్లు తిట్టి అసలు ప్రచారానికే రానీయకుండా అడ్డుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తాము ఓట్లు వేసేది లేదని జనాలు తెగేసి చెప్పారు. ఇక కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ తో ఊర్లకు వెళ్ళిపోయిన వేలాది మంది సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులు తిరిగి హైదరాబాద్ కు చేరుకోలేదు. ఇక ప్రచారం సందర్బంగా రాజకీయ పార్టీలు చేసిన ఓవర్ యాక్షన్ తో పోలింగ్ రోజున గొడవలు జరుగుతాయని ఓటర్లు భయపడ్డారు. ఇలాంటి అనేక కారణాల వల్ల పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది.