Begin typing your search above and press return to search.

గులాం న‌బీ ఆజాద్ మారిపోతున్నారా? ఇక‌, బీజేపీ లోకేనా?

By:  Tupaki Desk   |   6 Dec 2021 3:26 AM GMT
గులాం న‌బీ ఆజాద్ మారిపోతున్నారా? ఇక‌, బీజేపీ లోకేనా?
X
జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ప‌ట్టు పెంచుకున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు.. ఉమ్మ‌డి జ‌మ్ము క‌శ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి గులాం న‌బీ ఆజాద్ రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిరుగుతున్నాయా? ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా? అంటే.. తాజా గా మారుతున్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

కొన్నాళ్ల కింద‌ట‌.. ఆజాద్ రాజ్య స‌భ స‌భ్య‌త్వం ముగిసిపోయింది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు వీడ్కోలు స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో బీజేపీ దిగ్గజ నాయ‌కుడు, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ.. మాట్లాడుతూ.. ఆజాద్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ ప‌రిణామం అప్ప‌ట్లోనే సంచ‌ల‌నం సృష్టించింది.

ఎందుకంటే.. ఈశాన్య రాష్ట్రాల్లో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న ఆజాద్‌ను కాంగ్రెస్‌కు దూరం చేయ‌డ‌మే మోడీ ల‌క్ష్యంగా అడుగులు ప‌డుతున్నాయ‌ని అప్ప‌ట్లోనే శంక‌లు మొద‌ల‌య్యారు. ఇక‌, ఆ త‌ర్వాత కూడా ఆజాద్‌ను ప‌లు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. ఇదిలావుంటే.. కాంగ్రెస్ అధిష్టానానికి ఎప్పుడూ.. వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్న ఆజాద్‌.. అనంత‌ర కాలంలో రాహుల్ కేంద్రంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

పార్టీని ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. మీడియా ముఖంగా గ‌ళం వినిపించా రు. ఒక మైనారిటీ నాయ‌కుడు.. అందునా.. గాంధీల కుటుంబానికి వీర విధేయుడుగా పేరున్న ఆజాద్ ఇలా వ్యాఖ్యానించ‌డం వెనుక‌.. `ఢిల్లీ పెద్ద‌`ల వ్యూహం ఉంద‌ని కూడా అప్ప‌ట్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇక‌, ఇప్పుడు ఆయ‌న కాంగ్రెస్‌లోనే ఉన్న‌ప్ప‌టికీ.. అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఆజాద్ పార్టీ మార‌తార‌ని.. కొంద‌రు., కాదు.. కొత్త పార్టీ వైపు దృష్టి పెడుతున్నార‌ని కొంద‌రు ప్ర‌చారం చేయ‌డం ప్రారంభించారు. ప్ర‌స్తుతానికి ఈ చ‌ర్చ కేంద్రం స్థాయిలో జోరుగానే సాగుతోంది. అయితే.. తాజాగా ఆజాద్ మాత్రం.. జమ్మూ-కశ్మీరులో కొత్తగా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం తనకు లేదని ప్ర‌క‌టించారు.

అయితే భవిష్యత్తులో రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేనంటూ.. న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. అధికరణ 370 రద్దు తర్వాత నిలిచిపోయిన రాజకీయ కార్యకలాపాలను పునరుద్ధరించడం కోసమే తాను సమావేశాలు, సభలను నిర్వహిస్తున్నానని చెప్పారు.

గులాం నబీ ఆజాద్ ఇటీవల జమ్మూ-కశ్మీరులో పర్యటిస్తూ, కొన్ని చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయన సన్నిహితులు దాదాపు 20 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ను వదిలి, కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. ఆజాద్ మ‌ళ్లీ కాంగ్రెస్ అధిష్టానాన్ని కార్న‌ర్ చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌లో విమర్శల‌కు స్థానం ఉండేదని చెప్పారు.

కానీ, ప్రస్తుతం కాంగ్రెస్‌లో విమర్శల‌కు చోటు ఉండటం లేదని వ్యాఖ్యానించారు. పరిస్థితులు చెడు మార్గం పట్టినపుడు ప్రశ్నించడానికి తనకు మితిమీరిన స్వేచ్ఛను ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఇచ్చారన్నారు. విమర్శించడం తప్పు అని వారు ఎన్నడూ భావించేవారు కాదని చెప్పారు. నేటి నాయకత్వం విమర్శను తప్పుగా చూస్తోందని అన్నారు.

యువజన కాంగ్రెస్‌లో ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని ఇందిరా గాంధీ తనకు చెప్పారని, అయితే తాను అందుకు తిరస్కరించానని, అందుకు ఆమె ‘సరే’ అన్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో, తనను, ఆయనను ఇందిరా గాంధీ పిలిచారని చెప్పారు. రాజీవ్‌ను ఉద్దేశించి ఇందిర మాట్లాడుతూ, ‘‘గులాం నబీ నేను చెప్పినదానికి కాదని చెప్పగలరు. అలా కాదనడం అంటే అవిధేయంగా లేదా అగౌరవంతో ఉన్నట్లు కాదు. అది పార్టీ మేలు కోసమే’’ అని చెప్పారని తెలిపారు.

నేడు ఆ విధంగా కాదనడాన్ని వినడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. మొత్తానికి ఈ వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే.. వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌రం నాటికి లేదా.. జ‌మ్ములో ఎన్నిక‌లు నిర్వ‌హించే నాటికి.. ఆజాద్ పార్టీ మారినా.. మారిపోవ‌చ్చ‌ని.. లేదా.. బీజేపీ క‌నుస‌న్న‌ల్లో సొంత కుంప‌టి పెట్టినా.. పెట్టుకోవ‌చ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.