Begin typing your search above and press return to search.

అనాల్సింది అనేశారు.. తూచ్ అని ట్వీట్ తొలగించేశారు

By:  Tupaki Desk   |   24 Aug 2020 12:27 PM GMT
అనాల్సింది అనేశారు.. తూచ్ అని ట్వీట్ తొలగించేశారు
X
అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో మనసుకు తోచింది మాట్లాడేయటం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదు. ఈ సందర్భంగా పార్టీకి జరిగే నష్టం గురించి పట్టించుకోనట్లుగా వ్యవహరించటం.. ఆ తర్వాత తూచ్ అన్నట్లు వదిలేయటం చూస్తున్నదే. తాజాగా అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. ఇప్పటివరకు గ్రామ.. జిల్లా .. రాష్ట్ర స్థాయిలో ఈ తరహా సీన్లు చూపించిన కాంగ్రెస్.. తాజాగా జాతీయ స్థాయిలో ఈ తరహా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. పార్టీ జాతీయ అధ్యక్షుడ్ని ఎంపిక చేసుకునేందుకు మొదలైన సీడబ్ల్యూసీ సమావేశంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల సంగతి తెలిసిందే.

పార్టీ సీనియర్లు కూడబల్కుకొని పార్టీ చీఫ్ సోనియాకు రాసిన లేఖ లీక్ కావటంపై రాహుల్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి బీజేపీకి మేలు కలిగేలా వ్యవహరిస్తారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో హర్ట్ అయిన కాంగ్రెస్ సీనియర్లు గులాం నబీ అజాద్.. కపిల్ సిబాల్ లు ట్విట్టర్ వేదిక చేసుకొని రాహుల్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మా కమిట్ మెంట్ నే ప్రశ్నిస్తారా? అంటూ ట్వీట్లు చేస్తూ.. అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తామన్న మాటల్ని అనేశారు.

ఈ మొత్తం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మీడియాలోనూ ఈ లొల్లి హైలెట్ అయ్యింది. తర్వాతేం జరుగుతుందన్న సందేహాలకు తెర దించుతూ.. ఇద్దరు సీనియర్లు.. తాము చేసిన ట్వీట్లను డిలీట్ చేశారు. రాహుల్ తనతో వ్యక్తిగతంగా మాట్లాడారని.. ఆయన చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవి కాదని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. రాహుల్ పై ధ్వజమెత్తుతూ చేసిన ట్వీట్లను తొలగించనున్నట్లుగా పేర్కొంటూ వారు ట్వీట్లను డిలీట్ చేశారు. కాంగ్రెస్ లో పెను తుపాను చోటు చేసుకుంటుదని భావించిన వారందరికి టీ కప్పులో తుపానుగా వ్యవహారం సమిసిపోయింది. ఇంత దానికి ఒకరిపై ఒకరు ఆ స్థాయిలో దుమ్మెత్తి పోసుకోవాలా? అన్న సందేహం వచ్చిందా?అందుకే అంటారు.. అది కాంగ్రెస్ పార్టీ అని.