Begin typing your search above and press return to search.

ఆజాద్-కాంగ్రెస్..ఎవరి వల్ల ఎవరు లాభపడ్డారు ?

By:  Tupaki Desk   |   2 Sep 2022 4:56 AM GMT
ఆజాద్-కాంగ్రెస్..ఎవరి వల్ల ఎవరు లాభపడ్డారు ?
X
దాదాపు 50 సంవత్సరాలపాటు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్ ఇపుడు టాక్ ఆఫ్ ది పర్సనాలిటీ అయిపోయారు. ఆజాద్ రాజీనామా వల్ల కాంగ్రెస్ కు పెద్ద షాకంటు మీడియా నానా రచ్చ చేస్తున్నది. ఎప్పుడైతే ఆజాద్ పార్టీకి రాజీనామా చేశారో వెంటనే జమ్మూ కాశ్మీర్ లో కూడా వందల మంది కాంగ్రెస్ కు రాజీనామా చేయటం వల్ల పెద్ద దెబ్బ తప్పదంటు పెద్ద పెద్ద జోస్యాలే చెప్పేస్తున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఆజాద్ ఏరోజు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కష్టపడింది లేదు. కెరీర్ మొదట్లోనే రెండు సార్లు లోక్ సభకు గెలిచినా అది మహారాష్ట్ర నుండే కానీ కాశ్మీర్ నుండి కాదు.

మహారాష్ట్ర నుండి లోక్ సభకు గెలిచి కేంద్రమంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. అప్పటినుండి ఢిల్లీలోనే ఉండిపోయారు. కాశ్మీర్ కు ఎప్పుడు వెళ్ళినా చుట్టపు చూపుగానే. ఇక పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కేంద్ర మంత్రి వర్గంలోనే ఉండేవారు.

లోక్ సభ రెండోసారి టర్మ్ అయిపోయిన దగ్గరనుండి గడచిన 28 ఏళ్ళుగా రాజ్యసభకు నామినేట్ అవుతున్నారే కానీ మళ్ళీ లోక్ సభకు పోటీచేయటానికి ఇష్టపడలేదు. జాతీయ ప్రధాన కార్యదర్శి, సీడబ్ల్యూసీ సభ్యుడి హోదాలో అధిష్టానం తరపున అనేక రాష్ట్రాలకు ఇన్చార్జి హోదాలో అపరిమితమైన అధికారాలను అనుభవించారు.

ఆజాద్ ఇన్చార్జిగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుకన్నా ఓడిందే ఎక్కువ. ఈయన వల్ల ఏ రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతమైందే లేదు. పార్టీని అడ్డం పెట్టుకుని ఆజాద్ లాభపడ్డారే కానీ ఈయన వల్ల పార్టీకి జరిగిన మేలు ఏమీలేదనే చెప్పాలి.

చివరకు సొంత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పంపితే పూర్తి కాలం పదవిలో ఉండకుండా మధ్యలోనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు. ఇలాంటి నేత ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేశారంటే ఎలా నమ్మాలి ? పార్టీనుండి పిండుకోవాల్సినంత పిండేసుకుని చివరకు ఇక ఏమీ రాదని డిసైడ్ అయిపోయిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. కాబట్టి ఆజాద్ వెళ్ళిపోయినందుకు పార్టీకి కొత్తగా తగిలే షాక్ ఏమీలేదనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ గడచిన తొమ్మిదేళ్ళుగా షాక్ లోనే ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.