Begin typing your search above and press return to search.

టీడీపీలోనూ గులాం నబీలు....వాటెబౌట్ లోకేష్...?

By:  Tupaki Desk   |   31 Aug 2022 7:33 AM GMT
టీడీపీలోనూ గులాం నబీలు....వాటెబౌట్ లోకేష్...?
X
దేశంలో ఒక హాట్ పొలిటికల్ టాపి గా సీనియర్ మోస్ట్ నేత గులాం నబీ ఆజాద్ ఉన్నారు. ఆయనది అచ్చంగా అర్ధ శతాబ్దం పైగా సాగిన రాజకీయ జీవితం. కాంగ్రెస్ లోనే పుట్టి అందులోనే పెనవేసుకునిపోయిన రాజకీయం ఆయనది. ఇందిరాగాంధీ జమానాలో మంత్రిగా పనిచేసి ఈ రోజు దాకా చురుకుగా ఉన్న రాజకీయ నాయకులు కాంగ్రెస్ లో బహు తక్కువ. అలాంటి వారిలో గులాం నబీ ఆజాద్ అతి ముఖ్యుడు.

అలాంటి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ కి ఒక శుభోదయాన తలాఖ్ అనేశారు. ఆయనకు కాంగ్రెస్ విధానాలు నచ్చక కాదు, ఈ దేశానికి కాంగ్రెస్ కంటే గొప్ప ఆల్టర్నేషన్ ఉందనీ కాదు, కానీ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న కొత్త పరిణమాల వల్లనే గులాం నబీ ఆజాద్ ఆ పార్టీని వీడాల్సి వచ్చింది అని అంటారు. రాహుల్ గాంధీ ఆధిపత్యం ఎక్కువ కావడం, ఆయనకు తల్లి సోనియా గాంధీ ఫుల్ సపోర్ట్ గా ఉండడం, సీనియర్లకు గౌరవం లేకపోవడం స్థూలంగా చూస్తే ఆజాద్ కాంగ్రెస్ ని వీడిపోవడానికి ఇదే మెయిన్ రీజన్.

ఆయన కూడా మీడియా ఇంటర్వ్యూలలో అదే చెబుతూ వచ్చారు. మరి ఇదే గులాం నబీ ఆజాద్ ఇందిరాగాంధీ వారసుడిగా రాజీవ్ గాంధీ వచ్చినపుడు ఏ కోశానా ఇబ్బంది పడలేదు. దానికి కారణం రాజీవ్ గాంధీ తన సమర్ధతను అన్నిటా చూపించారు. గొప్ప నాయకుడు అనిపించుకున్నారు. ఇక సోనియా గాంధీ నాయకత్వ పగ్గాలు తీసుకున్న ఆజాద్ ఆమెకు పూర్తిగా సహకారం అందించారు. దానికి కారణం ఆమె కూడా పార్టీని సమిష్టిగా నడిపించారు.

కానీ రాహుల్ తోనే ఇబ్బంది వస్తోంది. దానికి కారణం ఆయన తనకు అంతా తెలుసు అనుకుంటూండడమే, పార్టీకి అతి పెద్ద మేధావివనరుగా ఉన్న అనుభవ సంపదగా ఉన్న సీనియర్లను కాదని అనుకోవడమే. దీంతోనే తేడా వస్తోంది. అందుకే ఆజాద్ కూడా చివరికి కాంగ్రెస్ ని విడిచిపెట్టకతప్పలేదు. అంటే రాహుల్ చాయిస్ అన్నది కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్లకు మింగుడు పడకుండా ఉందా అన్నదే అతి పెద్ద డౌట్.

ఇక ఇదే రకమైన పోలిక ఇపుడు ఏపీలో నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశంలో కూడా ఉంది అంటున్నారు. తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయకత్వాన్ని ఎవరూ ఇప్పటిదాకా ప్రశ్నించలేదు. ఆయన ఎన్టీయార్ వంటి మేరు నగధీరుడి నుంచి పార్టీని లాగేసుకున్నపుడు కూడా ఆయన వెన్నటి నడిచారు అంటే బాబు సమర్ధత మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉండడమే.

అటువంటి బాబు ఇపుడు పుత్ర వ్యామోహంలో పడిపోయారు అని ఆ పార్టీలో వినిపిస్తున్న మాట. లోకేష్ కూడా సీనియర్లను పెద్దగా పట్టించుకోరు అన్న విమర్శలు ఉన్నాయిట. అలాగే ఆయన కూడా తనను తాను ఎక్కుగవా ఊహించుకుంటారు అని అంటారు. అలాగే లోకేష్ సమర్ధత మీద కూడా సీనియర్లకు అనేక రకాలుగా డౌట్లు ఉన్నాయి.

అందుకే ఉత్తరాంధ్రా నుంచి మొదలుపెడితే సీమ జిల్లాల వరకూ సీనియర్లు బాబు నాయకత్వమే మేలు అంటున్నారు. తాము ఆయన కిందనే పనిచేస్తామని గట్టిగా చెబుతున్నారు. అయితే చంద్రబాబుకు రాజకీయంగా ఇంకా ఓపిక చాలా ఉంది. ఆయన వచ్చే ఎన్నికల్లో తన ఫేస్ ని చూపించే జనాల ముందుకు వెళ్లబోతున్నారు. అయితే బాబు కూడా తన తరువాత లోకేష్ పగ్గాలు చేపట్టాలని ఆశిస్తున్నారు.

సరిగ్గా ఇక్కడే టీడీపీలో మొదటి నుంచి ఉన్న వారి డిఫర్ అవుతున్నారు అన్న ప్రచారం సాగుతోంది. అందరూ కాదు కానీ అనేక మందికి పార్టీలో చంద్రబాబు తరువాత అంతటిసమర్ధుడు లోకేష్ కారన్న భావన ఉంది. ఇపుడు టీడీపీలో చూస్తే ఇక్కడ కూడా గులాం నబీలు చాలా మందే ఉన్నారు అని అంటున్నారు.

ప్రస్తుతానికి బాబు జమానా సాగుతోంది. లోకేష్ కి వీలైనంతగా పక్కకు పెడుతున్నారు కాబట్టి సరిపోతోందని, ఆయన్ని మరింతగా ఫోకస్ చేసి ముందుకు తెస్తే మాత్రం పసుపు పార్టీలో కూడా గులాం నబీ ఆజాదులు చాలా మందే బయటకు వస్తారా లోపల ఉండి పోరాడుతారా అన్నది అతి పెద్ద చర్చగానే ఉందని అంటున్నారుట.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.