Begin typing your search above and press return to search.

భారీగా ఉద్యోగులపై వేటు వేయ‌నున్న టెక్ దిగ్గ‌జ సంస్థ‌!

By:  Tupaki Desk   |   13 Oct 2022 5:07 AM GMT
భారీగా ఉద్యోగులపై వేటు వేయ‌నున్న టెక్ దిగ్గ‌జ సంస్థ‌!
X
2020, 2021ల్లో కరోనా ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేసింది. దీని ధాటికి ఎంతోమంది అశువులు బాశారు. దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. చిన్న కంపెనీలు మూతపడ్డాయి. పెద్ద కంపెనీలు సైతం చిగురుటాకులా వణికాయి. ప్రాజెక్టులు లేక పెద్ద కంపెనీల ఆదాయాలు పడిపోయాయి. దీంతో కంపెనీలు ఖర్చులను తట్టుకోవడానికి తమ సంస్థల్లో ఉద్యోగాలను వదుల్చుకున్నాయి.

కరోనా పోయింది.. ఇక అంతా సవ్యంగానే సాగుతుందనుకునే సమయంలో పులి మీద పుట్రలా ఆర్థిక మాంద్యం వచ్చిపడుతోంది. ఓ పక్క గత ఆరు నెలలుగా సాగుతున్న రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం, చైనా–తైవాన్‌ ఉద్రిక్తతలు, చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్‌ దేశాలు తీసుకున్న నిర్ణయం, రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి ప్రపంచ దేశాలకు నిలిపోయిన పామాలిన్, గోధుమల ఎగుమతులు, దీంతో భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు ఇలా అనేక కారణాలతో ఆర్థిక మాంద్యం ముంగిట ప్రపంచం నిలిచింది.

శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్రికన్‌ దేశాలు ఇప్పటికే మాంద్యం బారిన పడ్డాయి. అగ్ర రాజ్యం, ప్రపంచ దేశాలకు పెద్దన్న అమెరికా సైతం ఆర్థిక మాంద్యం ముంగిట ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు అన్నీ మళ్లీ పొదుపు మంత్రాన్ని పఠిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పర్సనల్‌ కంప్యూటర్లకు గిరాకీ తగ్గడంతో వాటిని తయారుచేసే ప్రముఖ సంస్థ ఇంటెల్‌ ఇబ్బందుల్లో పడింది. దీంతో ఉద్యోగులను భారీగా తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ తొలగింపు వేల సంఖ్యలో ఉంటుందని బ్లూమ్‌బర్గ్‌ బాంబు పేల్చడం గమనార్హం. అక్టోబర్‌ నెలలోనే ఉద్యోగుల తొలగింపు ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్‌ విభాగాల్లో దాదాపు 20 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన తప్పకపోవచ్చని సమాచారం. అయితే ఈ వార్తలపై ఇంటెల్‌ స్పందించడం లేదు. ప్రస్తుతం ఇంటెల్‌లో 1,13,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

కోవిడ్‌ సంక్షోభం సమయంలో వివిధ కంపెనీల ఉద్యోగులు ఇళ్లలో ఉండి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పనిచేయడంతో పర్సనల్‌ కంప్యూటర్లకు గిరాకీ పెరిగింది. దీంతో ఇంటెల్‌ మంచి లాభాలు చూసింది. అయితే ఇప్పుడు కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి చేయాలని కోరడంతో పర్సనల్‌ కంప్యూటర్లకు ఆర్డర్లు తగ్గిపోయాయి. దీంతో గత త్రైమాసికంలో ఇంటెల్‌ నష్టాలను చవిచూసింది. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చిత వాతావరణంతో మాంద్యం పరిస్థితులు నెలకొనడంతో పరిస్థితులు మరింత దిగజారాయి.

అయితే ఉద్యోగుల తొలగింపుపై ఇంటెల్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఈ ఏడాది జూలై నెలలో ఆ సంస్థ ప్రకటించిన సేల్స్‌ గణాంకాలు ఉద్యోగుల తొల‌గింపు విష‌యాన్ని నిర్ధారిస్తున్నాయ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఆర్థిక మాంద్యంతో ప్ర‌జ‌ల‌ కొనుగోలు సామర్ధ్యం ప‌డిపోవడం, పాఠ‌శాల‌లు క‌రోనా త‌ర్వాత తిరిగి ప్రారంభం కావ‌డం, ఉద్యోగుల‌ను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ వ‌దిలిపెట్టి కార్యాలయాలకు రావాల‌ని కంపెనీలు ఆదేశించ‌డం వంటి కార‌ణాల‌తో ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల వినియోగం త‌గ్గిపోయింది. దీంతో ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల త‌యారీ, సెమీ కండ‌క్ట‌ర్ల తయారీలో ఉన్న ఇంటెల్ ఈ ఏడాది త్రైమాసికంలో న‌ష్టాల‌ను చ‌విచూసింది. ఈ నేప‌థ్యంలోనే 20 ఉద్యోగుల‌ను తొల‌గించుకోవాల‌ని నిర్ణ‌యించింద‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.