Begin typing your search above and press return to search.

కొత్త నిబంధ‌న‌తో..గిద్ద‌లూరు ఎమ్మెల్యే దోచేస్తున్నారా?

By:  Tupaki Desk   |   28 Nov 2017 7:06 AM GMT
కొత్త నిబంధ‌న‌తో..గిద్ద‌లూరు ఎమ్మెల్యే దోచేస్తున్నారా?
X
ఏపీలో అధికార పార్టీ నేత‌ల దోపిడీ రాజ్యం కొనసాగుతోంద‌న్న ఆరోప‌ణ‌లు ఇటీవ‌లి కాలంలో మ‌రింత‌గా ఎక్కువ‌య్యాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో జ‌యాప‌జ‌యాల‌ను ప‌క్క‌న‌పెట్టేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందిన కాడికి దండుకునేందుకే ఆస‌క్తి చూపుతున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకోసం అప్ప‌టిదాకా అమ‌ల‌వుతున్న నిబంధ‌న‌ల‌ను కాద‌ని - కొత్త నిబంధ‌న‌ల‌ను తెరపైకి తీసుకువ‌స్తున్న నేతాశ్రీలు... జ‌నం త‌మ‌ను ఏమ‌నుకున్నా ఫ‌ర‌వా లేద‌న్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటూ నిబంధ‌న‌ల‌నే మార్చేస్తున్న వైనంపై అన్ని వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త ఎదుర‌వుతున్నా కూడా ప‌ట్టించుకునే నాథుడే క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఖ‌రే ఇలా ఉంటే... విప‌క్షం వైసీపీ టికెట్ల‌పై ఎమ్మెల్యేలుగా గెలిచి.. ఆ త‌ర్వాత లోపాయికారీ ఒప్పందాల మేర‌కు అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మ‌రింత‌గా చెల‌రేగిపోతున్నార‌న్న వార్త‌లు ఇప్పుడు మ‌రింత‌గా వినిపిస్తున్నాయి. వైసీపీలో ఉన్నంత కాలం త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎలాంటి నిధులు మంజూరు కాలేద‌ని చెబుతున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు... పార్టీ మారిన త‌ర్వాత పెద్ద ఎత్తున ప‌నులు మంజూరవుతున్నాయ‌ని లోలోప‌లే ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు.

అదే స‌మ‌యంలో ఇప్ప‌టిదాకా అస‌లు అభివృద్ధి ప‌నులే లేక‌పోగా... ఇప్పుడు ఇబ్బ‌డిముబ్బ‌డిగా వ‌చ్చి ప‌డిన ప‌న‌నుల‌తో అందిన కాడికి దోచుకునేందుకు ప‌క్కా స్కెచ్ రెడీ చేసుకుంటున్నారన్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయించి వ‌చ్చిన ఎమ్మెల్యేలు ఏకంగా నిబంధ‌న‌ల‌నే మార్చేస్తున్నా చంద్ర‌బాబు స‌ర్కారు మాత్రం చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. మొన్న‌టిదాకా వైసీపీలోనే ఉన్న ఆయ‌న అధికార పార్టీ తాయిలాల‌కు పూర్తిగా స‌రెండ‌ర్ అయిపోయార‌ట‌. దీంతో ఉన్న‌ప‌ళంగా పార్టీ మారిపోయిన ఆయ‌న ఇప్పుడు జేబులు నింపుకునే ప‌నిని ముమ్మ‌రం చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి మంజూరైన ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దందాకు తెర లేపిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగం ఎలా జ‌రుగుతుంద‌న్న విష‌యంపై గిద్ద‌లూరులో జనం నోట వినిపిస్తున్న మాట ఇలా ఉంది.

గిద్ద‌లూరు న‌గ‌ర పంచాయ‌తీ ప‌రిధిలో ఎస్సీ - ఎస్టీ కాల‌నీల్లో సీసీ రోడ్లు వేసేందుకు స‌బ్ ప్లాన్ కింద రూ.11.50 కోట్లు మంజూర‌య్యాయి. ఈ ప‌నుల‌ను రాష్ట్రానికి చెందిన ఏ కాంట్రాక్ట‌ర్ అయినా చేయ‌వ‌చ్చు. ఇందుకోసం పిలిచిన టెండ‌ర్ల‌లో ఆయా కాంట్రాక్ట‌ర్లు పాలుపంచుకోవ‌చ్చు. అయితే ఈ ప‌నుల‌ను త‌న అనుయాయుల‌కే ద‌క్కేలా చేయ‌డంలో అశోక్ రెడ్డి పెద్ద స్కెచ్చే వేశార‌ట‌. బ‌య‌టి కాంట్రాక్ట‌ర్ల ఎంట్రీని అడ్డుకునేందుకు గాను ప‌నులు చేసే ప్రాంతానికి 40 కిలో మీట‌ర్ల ప‌రిధిలో కాంక్రీటు బ్యాచింగ్ పాయింట్ ఉండాలంటూ ఓ కొత్త నిబంధ‌న పెట్టేసి టెండ‌ర్లు పిలిచారు. ఈ నిబంధ‌న కార‌ణంగా ఏ ఒక్క కాంట్రాక్ట‌ర్ కూడా టెండ‌రు వేసేందుకు వీలు లేకుండా పోయింది. ఎందుకంటే గిద్ద‌లూరు ద‌రిదాపుల్లో ఏ ఒక్క కాంట్రాక్ట‌ర్‌ కు కాంక్రీటు బ్యాచింగ్ పాయింట్ లేదు. అయినా ఇత‌ర మునిసిపాలిటీల్లో ఈ త‌ర‌హా నిబంధ‌న ఉందా? లేద‌నే చెప్పాలి. కేవ‌లం అశోక్ రెడ్డి సూచ‌న మేర‌కు గిద్ద‌లూరులోనే తొలిసారిగా ఈ కొత్త నిబంధ‌న‌ను పెట్టార‌ట‌.

ఈ నిబంధ‌న‌తో టెండ‌రు జారీ చేసి బ‌య‌టి కాంట్రాక్ట‌ర్ల‌కు చెక్ పెట్టేసిన ఎమ్మెల్యే.. ఆ త‌ర్వాత ఓ మంత్రికి చెందిన అల్లుడితో గిద్ద‌లూరు స‌మీపంలో కాంక్రీటు బ్యాచింగ్ పాయింట్‌ ను ఏర్పాటు చేయిస్తున్నార‌ట‌. ఈ పాయింట్ ప‌నులు ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే టెండ‌రు నోటిఫికేష‌న్ జారీ అయిపోవ‌డంతో కొత్త‌గా అమ‌ల్లోకి వ‌చ్చిన నిబంధ‌నను ఆస‌రా చేసుకుని ఒకే ఒక్క టెండ‌రు దాఖ‌ల‌య్యేలా ఎమ్మెల్యే చ‌క్రం తిప్పార‌ట‌. వెర‌సి ఆ మొత్తం రూ.11.50 కోట్ల విలువ చేసే ప‌నులు ఎమ్మెల్యే వ‌ర్గానికే ద‌క్క‌డం ఖాయ‌మైపోయింద‌ట‌. అయినా ఎవ‌రు చేసినా ప‌ని పూర్త‌వుతుంది క‌దా అంటే... కాంట్రాక్ట‌ర్ల మ‌ధ్య పోటీ ఉంటే... ప్ర‌భుత్వం నిర్దేశించిన దాని కంటే త‌క్కువ ధ‌ర‌కే ప‌నులు పూర్తి అవుతాయి. అలా కాకుండా సింగిల్ టెండ‌ర్ వ‌చ్చిందంటే... ఎక్సెస్ టెండ‌ర్ల‌తోనూ ప‌నులు ఇవ్వాల్సి వ‌స్తుంది. అంటే... ప్ర‌భుత్వానికి అద‌న‌పు ఖ‌ర్చు అన్న‌మాట‌. ఈ మంత్రంతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఎంత లేద‌న్నా... రూ.3.50 కోట్ల‌ను అప్ప‌నంగా జేబులో వేసేసుకుంటున్నార‌ని అక్క‌డి జ‌నం చెవులు కొరుక్కుంటున్నార‌ట‌.