Begin typing your search above and press return to search.

గిద్దలూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి...అధిష్టానానికి చేరుతుందా?

By:  Tupaki Desk   |   21 Sep 2020 12:30 PM GMT
గిద్దలూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి...అధిష్టానానికి చేరుతుందా?
X
సాధారణంగా ప్రతి పార్టీకి హార్డ్ కోర్ నేతలు - కార్యకర్తలు - అభిమానులు - క్యాడర్ ఉంటాయి. పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ హార్డ్ కోర్ బ్యాచ్ పార్టీ వెన్నంటే ఉంటుంది. ఎన్నికల ప్రచారం మొదలు పార్టీ పెట్టే ప్రతి సభకూ వీరంతా హాజరై తమ సమయాన్ని, డబ్బును ఖర్చు పెడుతుంటారు. అందుకు తగ్గట్టే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇటువంటి హార్డ్ కోర్ బ్యాచ్ ను పార్టీ అధిష్టానం చిన్న చిన్న కాంట్రాక్టులు - పనులు..ఇలా ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తుంది. ఒక వేళ ఈ క్రమంలో సొంతపార్టీలో అందరికీ న్యాయం చేయలేకపోయినా...కొందరికైనా న్యాయం చేస్తుంది. దీంతో - నేతలు - కేడర్ లో అసంతృప్తి ఉండదు. కానీ, ఎన్నో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పాటుపడిన సొంత కేడర్ ను కాదని....వేరే పార్టీ నుంచి వలస వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యతనివ్వడం - స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం...వారికే కాంట్రాక్టులు కట్టబెట్టడం వంటి చర్యలతో మాత్రం పార్టీ కేడర్ డీలా పడుతుంది. ఇక, దానికితోడు వైరి పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా వైరి పార్టీలోని కొందరు నేతలకు సదర నేత అనుకూలంగా ఉండడం వంటి చర్యలు ఎంతో బాధకలిగిస్తాయి. తాజాగా, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఈ తరహా ఘటనతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ పీఏ రావూరి రవీంద్రనాథ్ చౌదరి కొంత కాలం క్రితం వైసీపీలో చేరారు. ఒంగోలులో ఉండే రవీంద్రనాథ్ ...సంతనూతలపాడులో టీడీపీ అన్నీ తానై వ్యవహరించారు. గిద్దలూరు నియోజకవర్గం కంబం మండలంలో ఎల్ కోట-లింగంపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, వైసీపీని పదేళ్లుగా నమ్ముకొని - వైఎస్సార్ ని 30 ఏళ్లుగా అభిమానిస్తున్న వైసీపీ కార్యకర్తలు ఈ వ్యవహారంపై కొంత అసంతృప్తితో ఉన్నారు. ఆ తర్వాత రవీంద్రనాథ్ కు 18 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పనులు దక్కడంతో ఆ అసంతృప్తి తీవ్రమైంది అని ప్రచారం జరుగుతోంది. దీంతో, వైసీపీ - వైఎస్సార్ ను నమ్ముకున్నోళ్లకు సున్నం....టీడీపీ నుంచి వచ్చిన వారికి అన్నం అన్న చర్చ గిద్దలూరు వైసీపీ కార్యకర్తల్లో జరుగుతోంది. పార్టీకోసం పనిచేసిన తమను కాదని రవీంద్రనాథ్ కు టికెట్ - కాంట్రాక్టులు ఇవ్వడంపై వైసీపీ మండలస్థాయి నేతలు - కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే బీఎన్ విజయకుమార్ జన్మదినం సందర్భంగా టీడీపీ నేతలు, -కార్యకర్తలు ఇచ్చిన బ్యానర్ యాడ్ లో రవీంద్రనాథ్ పేరు కూడా ఉండడంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ బ్యాన్ చేసిన, - టీడీపీ అనుకూల పత్రికలో ఆ యాడ్ రావడం...అందులో రవీంద్రనాథ్ పేరు ఉండడంతో కార్యకర్తలు మండిపడుతున్నారు. వైసీపీ లో పదవులు - కాంట్రాక్టులు అనుభవించిన రవీంద్రనాథ్ టీడీపీ నేతలకు శుభాకాంక్షుల చెప్పడం - టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం ఏమిటని వైసీపీని ఏళ్లతరబడి అంటిపెట్టుకొని ఉన్న కార్యకర్తలు, - మండల స్థాయి నేతలు చర్చించుకుంటున్నారు. తమకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ దొరికితే ఇటువంటి విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని మండల స్థాయి నాయకులు - బూత్ స్థాయి నేతలు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లాలని - వైసీపీని ఏళ్ల తరబడి అంటిపెట్టుకొని ఉన్న తమకు ప్రాధాన్యత ఉంటుందా....లేక కొద్ది రోజుల క్రితం వలస వచ్చి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారికి ప్రాధాన్యత ఉంటుందో తెలుసుకోవాలన్న చర్చ నియోజకవర్గం మొత్తం జరుగుతోంది.