Begin typing your search above and press return to search.

కొత్త నినాదాన్ని తెచ్చిన కిష‌న్ రెడ్డి!

By:  Tupaki Desk   |   28 May 2019 5:20 AM GMT
కొత్త నినాదాన్ని తెచ్చిన కిష‌న్ రెడ్డి!
X
ఒక‌టి నీకు ద‌క్క‌లేదంటే.. దాని కంటే మిన్న మ‌రేదో ద‌క్కుతుంద‌న్న మాట‌ను కొంత‌మంది చెబుతుంటారు. దీనికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా బీజేపీ నేత కిష‌న్ రెడ్డి ఉదంతాన్ని చూపించొచ్చు. బీజేపీ పార్టీ ఆఫీసులో ఆఫీస్ బాయ్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. తాజాగా సికింద్రాబాద్ ఎంపీగా సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన ఆయ‌న ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ప్ర‌ధాని మోడీకి అత్యంత స‌న్నిహితుడే కాదు.. ఆయ‌న‌తో క‌లిసి గ‌తంలో ప‌లు టూర్ల‌కు వెళ్లిన ద‌గ్గ‌రిత‌నం ఆయ‌న సొంతం.

అయితే.. త‌న ప‌రిధిని దాటి వెళ్లేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని కిష‌న్ రెడ్డికి ఇప్పుడు ఢిల్లీకి వెళ్లే అవ‌కాశం క‌లిగింద‌ని చెప్పాలి. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే మోడీ కేబినెట్ లో చోటు ద‌క్కించుకునే అవ‌కాశం ఉన్న ముఖ్యుల్లో కిష‌న్ రెడ్డి ఒక‌రుగా చెబుతుంటారు. 2004నుంచి వ‌రుస‌గా మూడుసార్లు హ్యాట్రిక్ విజ‌యంతో ఎమ్మెల్యే అయిన ఆయ‌న‌.. 2018లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అంబ‌ర్ పేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి అనూహ్య రీతిలో ఓడిపోయారు. దీంతో ఆయ‌న విప‌రీత‌మైన వేద‌న‌కు గురైన‌ట్లు చెబుతారు.

అన‌వ‌స‌ర వివాదాల జోలికి పోకుండా ఉండ‌ట‌మే కాదు.. అవినీతి ఆరోప‌ణ‌లు ఆయ‌న మీద పెద్ద‌గా వినిపించ‌వు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న గెల‌వ‌క‌పోవ‌టంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇలాంటి వేళ‌.. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్య‌ర్థిగా ఆయ‌న‌కు అవ‌కాశం ద‌క్కింది. ఈ ఎన్నిక‌కు నాలుగు నెల‌ల ముందు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎదురైన ఓట‌మి నేప‌థ్యంలో.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న్ను చెల్ల‌ని కాసుగా అభివ‌ర్ణిస్తూ విమ‌ర్శ‌లు చేశారు.

అయిన‌ప్ప‌టికీ వాటిని ప‌ట్టించుకోకుండా హంగు.. ఆర్భాటానికి దూరంగా సైలెంట్ గా చేసిన ప్ర‌చారం ఆయ‌న‌కు లాభించ‌ట‌మే కాదు.. ఆయ‌నపై ఉన్న సానుభూతి కార‌ణంగా పోటాపోటీగా సాగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ మంచి మెజార్టీని సొంతం చేసుకున్నారు. కిష‌న్ రెడ్డి గెలుపు నేప‌థ్యంలో ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపేందుకు పెద్ద ఎత్తున అభిమానులు.. కార్య‌క‌ర్త‌లు.. నేత‌లు వ‌స్తున్నారు.

త‌మ‌తో ఖ‌రీదైన పూల‌దండ‌లు.. బొకేలు.. శాలువాలు తీసుకొస్తూ త‌మ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య చేశారు. త‌న‌కు తీసుకొచ్చే బొకేలు.. పూల‌దండ‌ల‌కు బ‌దులుగా అదే ఖ‌ర్చుతో నోటు పుస్త‌కాలు తీసుకురావాల‌ని.. వాటిని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుతున్న పేద విద్యార్థుల‌కు అందిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. మిగిలిన నేత‌లు సైతం ఇదే విధానాన్ని అమ‌లు చేస్తే.. పేద పిల్ల‌ల‌కు నోటు పుస్త‌కాల కొర‌త తీర‌టంతో పాటు.. అన‌వ‌స‌ర‌మైన ఆడంబ‌రాలు త‌గ్గుతాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కిష‌న్ రెడ్డి ఐడియాను ఎంత‌మంది ఫాలో అవుతారో చూడాలి.