Begin typing your search above and press return to search.

నిజ‌మే:గో మూత్రంలో బంగారం

By:  Tupaki Desk   |   28 Jun 2016 12:23 PM GMT
నిజ‌మే:గో మూత్రంలో బంగారం
X
గోమూత్రంపై జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌ల్లో మ‌రో కొత్త కోణం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆవు మూత్రంలో బంగారం ఉన్న‌ట్లుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గుజరాత్ లో జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం తేలింది. ఆ రాష్ట్రంలోని జునాఘడ్ జిల్లాలో ఎక్కువగా కనిపించే గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లు శాస్త్రవేత్త‌లు తేల్చారు.

గుజ‌రాతి పూర్వీకుల చిత్రాల్లో ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లుగా కొన్ని ఆధారాలు క‌నిపించాయి. ఈ నేప‌థ్యంలో జునాఘడ్ జునాఘ‌డ్ వ్య‌వ‌వ‌సాయ‌విశ్వ‌విద్యాల‌యం (జేఏయూ)కి చెందిన పరిశోధకులు గ‌త నాలుగేళ్లుగా గిర్ జాతి ఆవుల‌పై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. దాదాపు 400 గిర్ జాతి ఆవుల మూత్రంపై విస్తృతంగా పరిశోధ‌న‌లు నిర్వ‌హించ‌గా ఈ మేర‌కు బంగారం ఉన్న‌ట్లు తేలింది. గిర్ జాతి ఆవుల్లో లీటర్ మూత్రంలో మూడు మిల్లీ గ్రాముల నుంచి 10 మిల్లీ గ్రాముల వరకు స్వ‌ర్ణం ఉన్న‌ట్లుగా త‌మ ప‌రిశోధ‌న‌లో తేలిందని జేఏయూ వ‌ర్సిటీ బృందం తేల్చింది. బంగారానికి సంబంధించిన ధాతువులు నీటిలో కలిసిపోయి ఆవుల మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటిని ఏ విధంగా సేక‌రించవ‌చ్చో కూడా వారు వివ‌రించారు. కొన్ని రకాల కెమికల్ పద్ధతులను ఉపయోగించి గిర్ ఆవుల‌ మూత్రం నుంచి బంగారాన్ని బయటకు తేవచ్చని చెప్పారు.

ఇంతేకాకుండా ఆవుల మూత్రంలో వ్యాధుల నిరోధ‌క శ‌క్తి ఉన్న‌ట్లుగా జునాఘ‌డ్ అగ్రిక‌ల్చ‌ర్ వర్సిటీ ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. గేదే - గొర్రె - మేక - ఒంటెలపై ప‌రిశోధనలు చేయ‌గా వాటి మూత్రంలో వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి ఆధారాలేవీ కనిపించలేదట‌. అయితే గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో అనేక రకాల వ్యాధులకు నిరోధకంగా పనిచేసే లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. జునాఘ‌డ్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం చేసిన ప‌రిశోధ‌న ఇపుడు ఆవు విశిష్ట‌త విష‌యంలో కొత్త అంశాన్ని వెల్ల‌డించిన‌ట్ల‌యింది.