Begin typing your search above and press return to search.

సూదికి పడిన కక్కుర్తి ఫలితం.. ఇద్దరికి హెచ్ ఐవీ పాజిటివ్

By:  Tupaki Desk   |   7 Aug 2022 3:29 AM GMT
సూదికి పడిన కక్కుర్తి ఫలితం.. ఇద్దరికి హెచ్ ఐవీ పాజిటివ్
X
కొన్ని సందర్భాల్లో చిన్న తప్పునకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంటుంది. ఆ మూల్యం ఒక్కోసారి జీవితం కూడా అవుతుంటుంది. ఈ మాటకు తగ్గట్లే.. తాజాగాచోటు చేసుకున్న ఉదంతం నిలువెత్తు నిదర్శనంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో ట్రెండీగా మారిన టాటూ ట్రెండ్.. ఇద్దరిని హెచ్ఐవీ పాజిటివ్ గా మార్చింది. ఈ షాకింగ్ ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని ప్రసిద్ధపుణ్య స్థలం.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో చోటు చేసుుకోవటం గమనార్హం.

ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. వారణాసిలోని పద్నాలుగు మంది అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. వారికి జ్వరం ఉంది. దీంతో.. పలు పరీక్షల్లో భాగంగా టైఫాయిడ్.. మలేరియా పరీక్షలు నిర్వహించినా ఫలితం మాత్రం రాలేదు. అందుకు తగ్గ మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. అనుమానానికి గురైన ఆసుపత్రి సిబ్బంది వారికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. అందులో షాకింగ్ నిజం బయటకు వచ్చింది.

జ్వరం తగ్గని వారిలో ఇద్దరు హెచ్ఐవీ పాజటివ్ గా తేలింది. వారిలో ఒకరు అమ్మాయి అయితే.. మరొకరు అబ్బాయి. అమ్మాయికి పాతికేళ్లు అయితే.. అబ్బాయికి ఇరవైఏళ్లుగా చెబుతున్నారు. వీరిద్దరి గత చరిత్రను చూస్తే.. వారెవరికి ఇతరులతో శారీరక సంబంధాలు లేవన్న విషయాన్ని గమనించారు.అలాంటప్పుడు వారికి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చే వీలుంది. అది కూడా కాదన్నప్పుడు అదెలా? అన్న ప్రశ్న.. లోతుగా గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా షాకింగ్ నిజం వెలుగు చూసింది.

జర్వం బారిన పడిన పద్నాలుగు మంది ఇటీవల టాటూలు వేసుకున్న వారేనని గుర్తించారు. ఒక సెంటర్ లో వీరంతా టాటూలు వేసుకోగా.. వారందరికి ఒకే సూదితో టాటూ వేయటమే అసలు సమస్యగా గుర్తించారు. మరింత లోతుగా పరీక్షలు జరిపిన పోలీసుల మరో విషయాన్ని గుర్తించారు. అదేమంటే.. టాటూలు వేసే వ్యక్తి తరచూ మార్చాల్సిన సూదిని మార్చకుండా.. అందరికి ఒకే సూదితో పచ్చ బొట్టు పరిచినట్లుగా పేర్కొన్నారు. దీనికీ ఒక కారణం ఉంది. సూదుల ధరలు ఈ మధ్యన పెరిగిపోవటంతో.. వాటి ధరల్ని పరిగణలోకి తీసుకొన్న సదరు సెంటర్ యజమాని.. సూదల్ని మార్చలేదు. అతగాడి పుణ్యమా అని ఇద్దరిలో హెచ్ ఐవీ సోకిన వైనాన్ని గుర్తించారు. షాపువాడి కక్కుర్తి.. టాటూ వేయించుకున్న ఆ ఇద్దరి జీవితాన్ని కోలుకోలేని దెబ్బేసిందని చెప్పాలి.