Begin typing your search above and press return to search.

మిస్ట‌రీ కేసు: య‌జ‌మాని ఇంట్లో ఏం జ‌రిగింది? ‌బాలిక మృతికి కార‌ణాలేంటి?

By:  Tupaki Desk   |   4 Jun 2020 3:42 PM GMT
మిస్ట‌రీ కేసు: య‌జ‌మాని ఇంట్లో ఏం జ‌రిగింది? ‌బాలిక మృతికి కార‌ణాలేంటి?
X
పేద‌రికంతో ఉన్న కుటుంబానికి ఆసరాగా ఉందామ‌ని ఓ ఇంట్లో ప‌నికి కుద‌ర‌గా చివ‌ర‌కు ఆ ఇంట్లోనే అనుమాన‌స్ప‌ద స్థితిలో ఓ బాలిక మృతిచెందింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని ప్ర‌గ‌తిన‌గ‌ర్‌లో జ‌రిగింది. అయితే దీనిపై ఇంటి య‌జ‌మాని వ్య‌క్తిగ‌త కారణాలతో బాలిక చనిపోయిందని చెబుతుండగా.. త‌న కూతురి మ‌ర‌ణానికి యజమానే కారణమని బాలిక తల్లి ఆరోపిస్తోంది. ఈ మిస్ట‌రీని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

వివ‌రాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పోతులూరుకు చెందిన వివాహిత త‌న భ‌ర్త మ‌ర‌ణించ‌డంతో ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు బాధ్య‌త ఆమెపై ప‌డింది. కుటుంబ పోషణ కోసం ఆమె తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతోంది. 2016లో త‌న పెద్ద కూతురు అపర్ణ (16)ను హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రగతినగర్‌లో నివసించే ఫర్నీచర్ వ్యాపారి ప్రసాద్‌ ఇంట్లో పనికి పెట్టింది.

అయితే అప‌ర్ణ మూడురోజుల కింద‌ట వాచ్‌మెన్ ఫోన్ నుంచి తల్లితో మాట్లాడింది. తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని వచ్చి ఇంటికి తీసుకెళ్లిపోవాలని తల్లిని కోరింది. అయితే లాక్‌డౌన్ వల‌న రాలేకపోతున్నా.. కొన్నాళ్లు ఆగు అని చెప్పింది. అయితే జూన్ 1వ తేదీ మంగ‌ళ‌వారం ఉదయం య‌జ‌మాని ఇంట్లో అప‌ర్ణ అపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో వెంట‌నే యజమాని ప్రసాద్ కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించాడు. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. ఈ విషయం తెలుసుకున్న వెంట‌నే అపర్ణ తల్లి, కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి హైద‌రాబాద్‌కు చేరుకుంది. త‌న కూతురి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. అనంతరం అపర్ణ మృతదేహాన్ని స్వ‌గ్రామం పోతులూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే తన కూతురు మరణంపై ఆమె అనుమానాలు వ్య‌క్తం చేసింది. మూడు రోజుల కింద‌ట త‌న‌తో ఏడుస్తూ మాట్లాడింద‌ని, ఉండ‌లేక‌పోతున్నాన‌ని చెప్పింద‌ని అపర్ణ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో బాచుపల్లి పోలీసులు య‌జ‌మాని ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. బాలిక త‌న త‌ల్లికి ఫోన్ చేసిన త‌ర్వాత మ‌రో వ్య‌క్తికి చేసింద‌ని తెలిసింది. అయితే ఆ వ్య‌క్తి ఎవ‌రు? ఫోన్ చేసి ఏం మాట్లాడింద‌నే విష‌యం తెలియ‌డం లేదు. విచార‌ణ‌లో భాగంగా ప్రసాద్‌ ఇంట్లో త‌నిఖీ చేయ‌గా అక్క‌డ మూత తీసిన పురుగుల మందు డబ్బా క‌నిపించింది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అపర్ణ పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై త్వ‌ర‌లో విచార‌ణ చేప‌ట్టి వాస్త‌వాలు తెలియ‌ప‌రుస్తామ‌ని బాచుప‌ల్లి పోలీసులు చెబుతున్నారు.