Begin typing your search above and press return to search.

అమ్మ.. నాన్నలను కలపండంటూ చిన్నారి ప్లకార్డు.. కేసీఆర్ స్పందిస్తారా?

By:  Tupaki Desk   |   18 April 2022 5:32 AM GMT
అమ్మ.. నాన్నలను కలపండంటూ చిన్నారి ప్లకార్డు.. కేసీఆర్ స్పందిస్తారా?
X
భర్త ఒక చోట.. భార్య మరోచోట పని చేయటం కొత్త విషయం కాదు. కానీ.. మానవతా దృక్ఫధంతో వ్యవహరించి.. ఇలాంటి కొన్ని ఇష్యూలను పరిష్కరించే అవకాశం ఉన్నా.. ఉన్నతస్థానాల్లో ఉన్న వారికి పట్టని వైనం కనిపిస్తూ ఉంటుంది. తాజా ఉదంతం ఆ కోవలోకి చెందినదేనని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 370 పుణ్యమా అని.. పోలీసు శాఖలో పని చేసే భార్యభర్తలు ఇద్దరు 250 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం చేయాల్సిన దుస్థితి.

ఇళాంటివేళ.. తనకు ఎదురవుతున్న ఇబ్బంది గురించి తెలియజేస్తూ ఒక మహిళా కానిస్టేబుల్.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. డీజీపీ కోసం సిద్ధం చేసిన ఒక వాయిస్ మెసేజ్ ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అయ్యో అనిపించేలా ఉన్న ఈ ఉదంతంలో మూడేళ్ల కొడుకు.. తన తల్లిని తండ్రిని కలపాలంటూ ప్లకార్డు పట్టుకున్న ఫోటో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభ్యర్థిస్తున్న వైనం అయ్యో అనిపించకుండా ఉండదు.

జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తోంది మంజుల. ఆమె భర్త బదిలీ కారణంగా సిరిసిల్లలోని 17వ బెటాలియన్ లో పని చేస్తున్నాడు. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.

మిగిలిన ఉద్యోగాలకు భిన్నంగా పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. స్పౌజ్ నిబంధన కారణంగా భార్యభర్తలు ఇద్దరు వేర్వేరు చోట్ల పని చేయాల్సి రావటం.. మిగిలిన ఉద్యోగాల మాదిరి సెలవులు ఉండకపోవటంతో మంజుల తీవ్రమైన మానసిక ఒత్తిడితో నలిగిపోతోంది.

ఈ నేపథ్యంలో తన భర్తతో తాను కలిసి ఉండేలా చేయాలని కోరుతూ ఆమె ఒక వాట్సాప్ మెసేజ్ సిద్ధం చేశారు. అందులో ఏడుస్తున్న ఆమె.. తన ఆవేదనను వ్యక్తం చేసింది. తన భర్తకు దగ్గరగా ఉండేలా బదిలీ చేయాలని తాను ఉన్నతాధికారులకు ఎంత మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవటంతో చివరకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ద్రష్టికి వెళ్లేందుకు వీలుగా వాట్సాప్ మెసేజ్ ను తయారు చేసింది.

ఇదికాస్తా వైరల్ గా మారటంతో.. స్థానిక అధికారులు ఆమెను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఏమైనా.. ఉద్యోగస్తులైన భార్యభర్తలు ఇద్దరు ఒకే దగ్గర ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదా.. అధికారుల మీదా ఉందని చెప్పాలి. మరి.. తాజా ఉదంతంపై సీఎం కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.