Begin typing your search above and press return to search.

అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి.. వాట్సాప్ గ్రూపుల్లో షేర్..!

By:  Tupaki Desk   |   5 Jan 2023 1:09 PM GMT
అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి.. వాట్సాప్ గ్రూపుల్లో షేర్..!
X
పెరుగుతున్న టెక్నాలజీని కొందరు తప్పుడు ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. కొందరు కామంధులు కాలేజీ అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసి నగ్నంగా మారుస్తున్నారు. వాటిని వాట్సాప్ గ్రూపుల్లో.. ఫేస్ బుక్.. ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుండటం కలవరానికి గురిచేస్తోంది.

వాట్సాప్ ప్రొఫైల్ పిక్.. డీపీలో ఉండే అమ్మాయిల ఫోటోలను కొందరు వ్యక్తులు తమ ఫోన్లో సేవ్ చేసుకుంటున్నారు. ఈ ఫోటోలను అశ్లీల యాప్స్ సహాయంతో మార్పింగ్ చేసి నగ్నంగా మారుస్తూ తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. తాజాగా వీరి వేధింపుల బారిన హైదరాబాద్ లోని ఓ కళాశాల విద్యార్థినులు పడటం ఆందోళనను రేకెత్తిస్తోంది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఘట్ కేసర్ శివారులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల పట్ల కొందరు యువకులు అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థినుల వాట్సాప్ డీపీ ఫోటోలను మార్పింగ్ చేసి వాటిని నగ్నంగా మారుస్తూ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తుండటం శోచనీయంగా మారింది.

కొందరైతే ఏకంగా సదరు యువతి ఫోటోను నగ్నంగా ఆమెకే పంపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయితే తమతోపాటు కుటుంబం పరువు పోతుందని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సమయాల్లో వీరి వేధింపులు ఎక్కువ కావడంతో కళాశాల యువతి తాజాగా ఆందోళనకు దిగారు.

తమ ఫోటోలను మార్పింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్న వారిని గుర్తించి నిందితులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థినుల పట్ల కళాశాలకు చెందిన వ్యక్తులే మార్ఫింగ్ చేశారా? లేదా బయటి వ్యక్తుల ప్రమేయం ఏమైనా? ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. కాగా మార్ఫింగ్ ఫోటోలపై విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో కళాశాలలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.