Begin typing your search above and press return to search.

పారికర్‌ కు నిద్రలేకుండా చేస్తామంటున్న అమ్మాయిలు

By:  Tupaki Desk   |   11 Feb 2018 7:21 AM GMT
పారికర్‌ కు నిద్రలేకుండా చేస్తామంటున్న అమ్మాయిలు
X
వివాదరహితుడిగా పేరున్న గోవా సీఎం మనోహర్ పారికర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియా సాక్షిగా అమ్మాయిలు ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అమ్మాయిల్లో మందు కొట్టే అలవాటు పెరిగిపోయిందని ఆయన అనడంతో ఈ వివాదం మొదలైంది.

అమ్మాయిల్లో మందు కొట్టే అలవాటు పెరిగిపోయిందని, బీరును అధికంగా తాగుతున్న అమ్మాయిలను చూస్తుంటే తనకెంతో భయం కులుగుతోందని పారికర్ అన్నారు. ఆ మాటలపై మహిళా లోకం భగ్గుమంటోంది. పలువురు అమ్మాయిలు.. #GirlsWhoDrinkBeer హ్యాష్ ట్యాగ్‌తో తాము బీరు తాగుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.

అంతేకాదు... అమ్మాయిలు బీరు తాగడాన్ని చూశానని చెబుతున్న పారికర్ కు అమ్మాయిలు ఇంకా ఏమేం చేస్తున్నారో తెలియదేమో అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మహిళలు పోర్న్ మూవీస్ చూస్తారని, సిగరెట్లు తాగుతారని ఆయనకు తెలిస్తే నెలల తరబడి నిద్రపోరేమోనని ఒకరు... ప్రధాని మహిళను చూసి నవ్వుతారు, పారికర్ అమ్మాయిలను చూసి భయపడతారు, యోగి మహిళలను ఇంటికే పరిమితం చేయాలంటారు... వీరా మన పాలకులు అని మరొకరు పోస్ట్ చేశారు.

మరికొందరైతే దేశంలోని మిగతా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. పారికర్ కు ఎనిమిది నెలల పాటు రేప్ నకు గురైన అమ్మాయి సంగతి తెలియదా? పరువు హత్యలు కనిపించడం లేదా? పట్టపగలు బస్సుల్లో లైంగిక వేధింపులు తెలియవా? అవన్నీ పారికర్ ను భయపెట్టవా? అని కూడా కామెంట్లు వస్తున్నాయి. ఓ అమ్మాయిగా బీరు తాగడం నాకిష్టం అంటూ చాలా మంది అమ్మాయిలు బీరు తాగుతున్న ఫోటోలను పోస్టు చేస్తున్నారు.