Begin typing your search above and press return to search.

మరోసారి వివాదంలో 'గీతం'!

By:  Tupaki Desk   |   6 Jan 2023 7:44 AM GMT
మరోసారి వివాదంలో గీతం!
X
విశాఖపట్నంలో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు భరత్‌ కు చెందిన గీతం వైద్య కళాశాల వార్తలకెక్కింది. గతంలో గీతం వైద్య కళాశాల పరిసరాల్లో గుర్తించిన ప్రభుత్వ భూమి చుట్టూ గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ), రెవెన్యూ అధికారులు కంచె ఏర్పాటు చేశారు. దీంతో వైద్య కళాశాల పరిసరాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. జనవరి 6న వేకువజాము నుంచే దీనికి సంబంధించిన కసరత్తును అధికారులు ప్రారంభించారు.

ముందుగా వైద్యకళాశాల భవనాలను కూలుస్తారనే ప్రచారమూ జరిగింది. ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు పెట్టి విస్తృతంగా పోలీసులు తనిఖీలు చేపట్టడం.. మరోవైపు టీడీపీకి చెందిన ముఖ్యనేతలను పోలీసులు గృహనిర్బంధం చేయడం వైద్య కళాశాలను కూలుస్తారన్న ఊహాగానాలకు ఊతమిచ్చింది. అయితే గతంలో వైద్య కళాశాల నుంచి స్వాధీనం ప్రభుత్వ భూమి చుట్టూ తాము కంచె మాత్రమే ఏర్పటు చేస్తున్నామని ఆర్డీవో పేర్కొనడంతో పరిస్థితి సద్దుమణిగింది.

కాగా గీతం వైద్య కళాశాల చుట్టూ కంచె వేయడానికి తెల్లవారుజామునే రెవెన్యూ, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) సిబ్బంది గీతం వైద్యకళాశాల ప్రధాన ద్వారం వద్దకు రావడం గమనార్హం. వచ్చీరాగానే కంచె ఏర్పాటుకు అవసరమైన సామగ్రితో అక్కడికి చేరుకుని పనులు ప్రారంభించారు. భీమిలి ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, డీఆర్వో పర్యవేక్షణలో సుమారు 3 గంటలపాటు కంచె పనులు కొనసాగాయి.

ఈ నేపథ్యంలో గీతం వైద్య కళాశాల పరిసరాల్లో పలుచోట్ల 'ప్రభుత్వ భూమి' అని అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. కంచె ఏర్పాటు నేపథ్యంలో ముందస్తుగా గీతం వైద్య కళాశాల పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఆ మార్గంలో వెళ్లే వారిని తనిఖీలు చేశారు. మీడియాతో పాటు ఎవర్నీ కళాశాల లోపలికి అనుమతించలేదు.

కంచె ఏర్పాటును అడ్డుకుంటారని అంతకుముందు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు మరికొందరు టీడీపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

కాగా గీతం వైద్య కళాశాలను ఆనుకుని ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలోనే స్వాధీనం చేసుకున్నామని.. ఇప్పుడు కంచె మాత్రమే ఏర్పాటు చేశామని ఆర్డీవో భాస్కర్‌రెడ్డి వివరించారు. రుషికొండ గ్రామ సర్వే నంబర్‌ 37, 38లోని స్థలాన్ని అప్పట్లో స్వాధీనం చేసుకున్నామని గుర్తు చేశారు. గతంలోనే ఈ స్థలాన్ని మార్క్‌ చేశామని.. ప్రస్తుతం 5.25 ఎకరాల్లో కంచె వేశామని చెప్పారు. మిగిలిన స్థలానికి ప్రభుత్వ భూములే సరిహద్దులుగా ఉండటంతో కంచె ఏర్పాటు చేయలేదని వెల్లడించారు. కాగా ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేవని తెలిపారు. పని త్వరగా పూర్తవ్వాలనే ఉద్దేశంతోనే తెల్లవారుజాము నుంచి పనులు చేపట్టామని వివరించారు. పది చోట్ల ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టామన్నారు.

మరోవైపు గీతం వర్సిటీ వద్దకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతం ఛైర్మన్‌ భరత్‌ ను కలిసేందుకు వెళ్తున్నామని.. తమను వెళ్లనివ్వాలని కోరాడ రాజాబాబు తదితరులు పోలీసులకు తెలిపారు. అయినా పోలీసులు అడ్డుకోవడంపై నిప్పులు చెరిగారు. అంతేకాకుండా టీడీపీ నేతలు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజాబాబు మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో కంచె వేయాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. ఈ తరహాలో పోలీసు ఆంక్షలు గతంలో ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.