Begin typing your search above and press return to search.

మాల్యా అప్పు మీద ఆమె ఎలా మాట్లాడారో చూశారా?

By:  Tupaki Desk   |   20 March 2016 4:29 AM GMT
మాల్యా అప్పు మీద ఆమె ఎలా మాట్లాడారో చూశారా?
X
ఒక పారిశ్రామికవేత్త మరో పారిశ్రామికవేత్తకు అండగా నిలుస్తారన్న మాటలో ఎంత నిజం ఉందన్న విషయం తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చెప్పకనే చెబుతాయి. బయోకాన్ ఎండీగా సుపరిచితురాలైన కిరణ్ మజుందార్ షా వార్తల్లోకి వచ్చాయి. అయితే.. ఎప్పటిలా కాకుండా ఆమె మాల్యాను ఒకింత వెనకేసుకుంటూ రావటంతో ఆమె వ్యాఖ్యలకు ఇప్పుడు ప్రముఖంగా మారాయి. రూ.9వేల కోట్ల అప్పును ఎగవేసి.. గుట్టుచప్పుడు కాకుండా దేశం విడిచి పోయిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మాల్యా ఘనకార్యానికి కారణమైన వారి లెక్క ఒక కొలిక్కి రాలేదు. అయితే.. మాల్యాకు సంబంధించిన ఎన్నో వివరాలు మీడియాలో అదే పనిగా రావటం పలువురు పారిశ్రామికవేత్తలకు అస్సలు నచ్చటం లేదన్న విషయం తాజాగా బయోకాన్ ఎండీ మాటల్ని చూస్తే.. అర్థమవుతుంది. ఆమె ఒక్కరే కాదు..రాహుల్ బజాజ్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యల్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

బ్యాంకులతో ఉన్న అప్పుల లెక్కలు తేల్చుకునేందుకు మాల్యాకు ఒక అవకాశం ఇవ్వాలని కిరణ్ మజుందార్ షా పేర్కొనటం గమనార్హం. మీడియా చేస్తున్న విచారణతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న అర్థం వచ్చేలా ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఎయిరిండియా అప్పుల కుప్ప గురించి ప్రస్తావించి దాని లెక్కేమిటని అడగటం గమనార్హం.

దేశంలో చాలామందికి భారీ స్థాయిలో అప్పులున్నాయని.. కానీ వారెవరినీ ఎగవేతదారుగా ప్రకటించలేదని.. ఎయిరిండియాకు రూ.43వేల కోట్ల అప్పు ఉందని.. మరింత రుణం ఎందుకు ఉంది? దీనికి కారణం ఏమిటని ఎవరూ అడరని చెప్పిన ఆమె.. ‘‘ఎయిరిండియాలో మాల్యా లాంటి వ్యక్తి ఎవ్వరూ లేరు. అదో ముఖం లేని సంస్థ. అందుకే మనం అడగం’’ అంటూ వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. మాల్యా నేరం పెద్దదిగా భావించట్లేదన్న భావన ఆమె మాటలు చెబుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు మాల్యా ఉదంతంపై రాహుల్ బజాజ్ స్పందిస్తూ.. తీసుకున్న అప్పులు చెల్లించకపోవటానికి సహేతుకమైన కారణం ఉన్న చోట చర్యలు తీసుకోకూడదని వ్యాఖ్యానించటం విశేషం.