Begin typing your search above and press return to search.

గాజు గ్లాస్ : జనసేనను కలవరపెడుతోందా...?

By:  Tupaki Desk   |   13 Jun 2022 6:42 AM GMT
గాజు గ్లాస్ : జనసేనను కలవరపెడుతోందా...?
X
జనసేన పార్టీలో ఇపుడు చూస్తే కొత్త ఉత్సాహం పొంగి పొరలుతోంది. ఒక విధంగా ఈసారి ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని గట్టి ధీమా అయితే ఉంది. 2019 ఎన్నికల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈసారి పకడ్బంధీ వ్యూహాలను అమలు చేస్తోంది ఆ పార్టీ. పొత్తుల మీద ఇతర అంశాల మీద కూడా పూర్తి ఫోకస్ పెడుతోంది.

ఇక జనసేనలో కూడా ఈసారి ఏపీలోనే ఒక అద్భుతం జరిగి తీరుతుందని పవన్ కళ్యాణ్ సీఎం అయి తీరుతారు అని కూడా భావన కనిపిస్తోంది. పవన్ సైతం ఎన్నికలు ఎపుడు జరిగినా తాను జనంలోనే ఉండాలని ఫిక్స్ అయిపోయారు. గతానికి భిన్నంగా ఆయన బస్సు యాత్రను కూడా డిజైన్ చేసుకున్నారు. ఆరు నెలల పాటు ఏపీ అంతా తిరిగితే కచ్చితంగా పట్టు చిక్కుతుందని, రాజకీయం మొత్తం జనసేన వైపు టర్న్ అవుతుందని కూడా అంచనా వేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే జనసేనకు అన్నీ ఉన్నా కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఇంకా వెంటాడుతున్నాయని అంటున్నారు. జనసేనకు కామన్ సింబల్ గా ఉన్న గాజు గ్లాస్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చుక్కలు చూపిస్తోంది. గాజు గ్లాస్ తమ పార్టీ గుర్తుగా కేటాయించాలని ఆ పార్టీ ఎప్పటి నుంచో కోరుతున్నా 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లను పరిశీలించిన మీదట కామన్ సింబల్ మీద కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చేసింది.

గుర్తింపు పొందిన పార్టీగా జనసేనను పరిగణించకపోవడంతో ఆ పార్టీకి కామన్ సింబల్ అన్నది ఒక సమస్యగా మారుతోంది. ఈ రోజుకీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద జనసేన రిజిష్టర్డ్ పార్టీగానే నమోదు అయి ఉంది. అంటే కొత్తగా నమోదు చేసుకున్న పార్టీలతో పాటుగానే జనసేన కూడా ఈ రోజుకీ ఉంది అన్న మాట.

ఈ కారణం చేతనే జనసేనకు 2019 ఎన్నికల్లో కామన్ సింబల్ గా ఉన్న గాజు గ్లాస్ ని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలోనూ, బద్వేల్ ఉప ఎన్నికలోనూ కూడా స్వతంత్రులకు ఎన్నికల సంఘం కేటాయించింది. ఇక ఈ నెల 23న జరగనున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో కూడా నవరంగ్ కాంగ్రెస్ పాటీ తరఫున పోటీ చేసిన షేక్ జలీల్ కి గాజు గ్లాస్ గుర్తుని కేటాయించారు. జనసేనకు అప్పట్లో ఇచ్చిన గుర్తు తమ పార్టీకి ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ తన గెలుపునకు మద్దతు ఇవ్వాలని జలీల్ కోరడం విశేషం.

దీంతో జనసేన వర్గాలలో టెన్షన్ మొదలైంది. తమ గుర్తు అనుకున్న గాజు గ్లాస్ ని ఇలా ఇతర పార్టీలకు స్వతంత్రులకు కేటాయిస్తే రేపటి ఎన్నికల్లో తమకు ఆ గుర్తు ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ కూడా మొదలైంది. ఈ విషయంలో అవసరం అయితే న్యాయ పోరాటానికి కూడా సిద్ధం కావాలని ఆ పార్తీ భావిస్తోందిట. మరి గాజు గ్లాస్ గుర్తు కాకుండా వచ్చే ఎన్నికల్లో జనసేనకు వేరే గుర్తు కేటాయిస్తారా అలా చేస్తే ఇప్పటికే జనసేన గాజు గ్లాస్ అంటూ క్యాడర్ సహా జనాలకు పరిచయం ఉన్న గుర్తు లేకపోతే వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయని కూడా ఆ పార్టీ భావిస్తోంది. మొత్తానికి జనసేన గాజు గ్లాస్ గుర్తు కోసం కొత్తగా పోరాటం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది మరి.