Begin typing your search above and press return to search.

కరోనా ఉగ్రరూపం : కోటి 50 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు!

By:  Tupaki Desk   |   23 July 2020 10:45 AM IST
కరోనా ఉగ్రరూపం : కోటి 50 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు!
X
ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తుంది. రోజురోజుకీ కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు సామాన్యులతో పాటుగా, ప్ర‌ముఖులు కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,53,73,616 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక, అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ 6,30,193 మంది కరోనా భారిన పడి కన్నుమూశారు. ప్రస్తుతం 53,94,222 యాక్టీవ్ కేసులు ఉండగా, 99,79,394 మంది కరోనా వైరస్ నుండి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక, ఈ కరోనా మహమ్మారి దెబ్బకి అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 60 వేల‌కు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్ప‌టివ‌ర‌కూ అమెరికాలో ఇప్పటివరకు మొత్తం నమోదు అయిన కేసుల సంఖ్య 41,00,875కు చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,46,183 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీ లో కరోనా కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇక భారత్ లో కూడా కరోనా కేసులు విరివిగా పెరుగుతున్నాయి. తాజాగా క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,720 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. మరో 29,557 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 1129 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో ఒక రోజులో ఇంత భారీ సంఖ్యలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. తాజా కేసులతో భారత్ ‌లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,38,635కి చేరింది. వీరిలో 7,82,606 మంది కరోనా మహమ్మారిని జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మనదేశంలో ఇప్పటి వరకు 29,861 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 4,26,167 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మనదేశంలో ఇప్పటి వరకు కోటి 50 లక్షల 75వేల మందికి పైగా కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.