Begin typing your search above and press return to search.

పాపం.. ‘గ్లోబరీనా’దేనా..?

By:  Tupaki Desk   |   27 April 2019 8:55 AM GMT
పాపం.. ‘గ్లోబరీనా’దేనా..?
X
ఇంటర్ మీడియెట్ లో అవకతవకలకు కర్త కర్మ క్రియ ఫలితాల కాంట్రాక్ట్ పొందిన ‘గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ దేనని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘త్రిసభ్య కమిటీ’ నిగ్గుతేల్చిందని సమాచారం. ఈ వ్యవహారంలో మొత్తం తప్పు గ్లోబరీనా సంస్థదేనని నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఫలితాల్లో తప్పిదాలకు కాంట్రాక్ట్ సంస్థదే ప్రధాన బాధ్యతగా కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం.

పరీక్ష ఫీజుల చెల్లింపుకు వెబ్ సైట్ సరిగ్గా పనిచేయలేదని.. డేటా ప్రాసెసింగ్, లోపాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు, ఫలితాల ప్రాసెసింగ్ వరకూ గ్లోబరీనా సంస్థ అనేక సాంకేతిక తప్పిదాలకు పాల్పడిందని కమిటీ నిర్ధారించినట్టు సమాచారం.

* అనర్హతగల సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడమే మొదటి తప్పు
గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడమే వ్యూహాత్మక తప్పిదమని.. నిబంధనలను ఇంటర్ బోర్డు పట్టించుకోకుండా ఏకపక్షంగా కట్టబెట్టినట్లుగా కమిటీ గుర్తించింది. కాంట్రాక్ట్ పొందినప్పటి నుంచి గ్లోబరీనా సంస్థ సాంకేతిక పొరపాట్లు చేసిందని..నిగ్గు తేల్చింది. కాంట్రాక్ట్ కట్టబెట్టడంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరాతీసినట్లు సమాచారం.

*తప్పు వీరందరిదీ..
ఇంటర్ అవకతవకలపై లోగుగా అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ మొత్తంగా వివిధ కేటగిరీల వారీగా తప్పు చేసిన వారందరి పేర్లను నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఇంటర్ బోర్డ్ అధికారులు, ఉద్యోగులు, గ్లోబరీనా సంస్థ ప్రతినిధుల తప్పు ఉందని తేల్చింది. అధికారులపై వచ్చిన ఆరోపణలు, మీడియా కథనాల ఆధారంగా వివరాలు సేకరించి ప్రభుత్వానికి కఠిన నిజాలు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం.

*విచారణలో పారదర్శకత, సీక్రెట్స్
లక్షలాది మంది విద్యార్థులతో ముడిపడి ఉన్న ఇంటర్ అవకతవకలపై త్రిసభ్య కమిటీ చాలా రహస్యంగా నివేదిక, విచారణ జరుపుతోంది. తప్పు ఒప్పుల నిగ్గు తేల్చేందుకు సేకరించిన వివరాలను బహిర్గతం పరచడం లేదు. మీడియాకు, బయటా వ్యాఖ్యానించకుండా కమిటీ సభ్యులు గోప్యత పాటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెలరేగి సున్నిత సమస్య కావడంతో బయటపడితే పరిస్థితి తారుమారు అయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి రహస్యంగా నివేదికను ఇచ్చే పనిలో పడింది.

* త్రిసభ్య కమిటీ ఏం తేల్చనుంది?
గ్లోబరీనా సంస్థపై ఆరోపణలు.. ఇంటర్ బోర్డు ఉన్నతాధికారుల వ్యవహారశైలి.. ఇలా చాలా పెద్ద తంతగం ఉండడంతో త్రిసభ్య కమిటీ పెను సవాల్ ఎదుర్కొంటోంది. మూడు రోజుల్లోనే కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కొనడంతో ఒత్తిడి పెరిగిపోయింది. సాంకేతిక కారణాలతోనే నివేదిక సమర్పణలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.ఇక ఫలితాల పొరపాట్లలో కాంట్రాక్ట్ సంస్థ తమ తప్పు లేదని రకరకాలుగా మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో కమిటీ సభ్యులు తప్పు ఎవరిది తేలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.